జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల్లో నిందితురాలయిన ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి … జగన్మోహన్ రెడ్డి సర్కార్ బంపర్ ఆఫర్ ఇచ్చింది. కేసుల కారణంగా ఇంత కాలం నిలిచిపోయిన ప్రమోషన్లను కల్పించింది. ఇప్పటి వరకూ ఆమె కార్యదర్శి హోదాలో ఉన్నారు. ఏపీకి వచ్చి గట్టిగా నెల కాకుండానే.. కార్యదర్శి ర్యాంక్ నుంచి ముఖ్యకార్యదర్శిగా ప్రమోషన్ ఇస్తూ… చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులు జారీ చేసింది. విశేషం ఏమిటంటే.. ఆదిత్యనాథ్ దాస్ కూడా.. జగన్ అక్రమాస్తుల కేసుల్లో పేరు ఉన్న వారే. అయితే.. శ్రీలక్ష్మికి ప్రమోషన్ ఇవ్వడం చెల్లుతుందా అనే సందేహం ఉంది. అందుకే.. ఆదిత్యనాథ్ దాస్.. ఈ ప్రమోషన్ ఉత్తర్వుల్లోనే…డిస్క్లెయిమర్ కూడా చేర్చారు. శ్రీలక్ష్మి మీదున్న పెండింగ్ కేసుల తీర్పులు, డీవోపీటీ నిర్ణయం మేరకు అమలు జరుగుంతుందని.. తుదితీర్పులకు లోబడే ఉత్తర్వుల కొనసాగింపు ఉంటుందని వివరణ ఇచ్చారు.
అంటే… సీఎస్ ఈ విషయంలో తనపై ఎలాంటి నింద పడకుండా జాగ్రత్త పడ్డారన్న మాట. అతి చిన్న వయసులో ఐఏఎస్ సాధించిన శ్రీలక్ష్మి… జగన్ అక్రమాస్తుల కేసులో ఇరుక్కోకుండా ఉండి ఉంటే… చీఫ్ సెక్రటరీ అవడానికి అవకాశం ఉండేది. అదీ కూడా చాలా ఎక్కువ కాలం ఆమె సీఎస్ హోదాలో ఉండేవారు. కానీ అక్రమాస్తుల కేసులో ఇరుక్కున్న తర్వాత జైలు పాలయ్యారు. బెయిల్ వచ్చిన తర్వాత పోస్టింగ్.. ఆ తర్వాత కేసుల కారణంగా ఆమె లూప్ లైన్లోనే ఉండిపోయారు. తెలంగాణ సర్కార్ ఆమెను ప్రాధాన్యతా పోస్టులు కల్పించలేదు. జగన్ ఏపీలో అధికారంలోకి రావడంతో ఆమెకు ఉత్సాహం వచ్చినట్లయింది.
ఏడాదిన్నర పాటు తెలంగాణలో విధులకు వెళ్లకుండా… కష్టపడి.. క్యాడర్ మార్పించుకుని ఏపీకి వచ్చారు. రాగానే ప్రమోషన్ ఉత్తర్వులు తెచ్చుకోగలిగారు. అయితే ఆ కేసులు మాత్రం వెంటాడుతూనే ఉంటాయని… ఆదిత్యనాథ్ దాస్..తన ఉత్తర్వుల్లో చెప్పకనే చెప్పారు. అయితే సహ నిందితులందరికీ జగన్ ఇలా మేళ్లు చేయడం… తర్వాత ఇబ్బందికరం అవుతుందన్న చర్చ న్యాయవర్గాల్లో జరుగుతోంది.