ప్రజలను నోరు తెరవకుండా కట్టడి చేసి.. వారికి నాలుగు మెతుకులు పడేస్తున్నాం కదా అని బానిసలుగా చూసుకుంటే వారి ఆగ్రహం కట్టలు తెగిన రోజున పాలకులు పరారవ్వాల్సిందే. చేతిలో పోలీసులు.. మిలట్రీ ఉన్నారంటే…కావాలంటే బొక్కలో తోస్తామనే హెచ్చరికలు.. భయ పెట్టడాలు… అలాంటి సమయంలో జుజుబీలే. దీనికి తాజా సాక్ష్యం. శ్రీలంక. తమ దేశాన్ని అప్పులతో దివాళా తీయించిన అధ్యక్షుడు గోటబయ రాజపక్సే పారిపోయేలా అక్కడి ప్రజలు చేశారు.
నిజానికి రాజపక్సే పార్టీ 2020లో జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. భారీ మెజార్టీ సాధించింది. యాభై శాతానికిపైగా ఓట్లు… 70 శాతానికిపై గాసీట్లు సాధించింది. 225 స్థానాలున్న పార్లమెంట్లో ప్రతిపక్షాలకు యాభై సీట్లు కూడా లేవు. దీంతో వారు ఆడిందే ఆట పాడిందే పాట అయింది. ఓటు బ్యాంక్ కోసం జనాలకు ఉచిత పథకాలు పెట్టారు. విచిత్రంగా పన్నులు పెంచలేదు. తగ్గించారు. అయినా ఆదాయం లేకపోవడంతో శ్రీలంక కుప్పకూలింది. అప్పులిచ్చేవారు మొహం చాటేశారు. అప్పులు కట్టే పరిస్థితి లేదు. దివాలా తీసింది. దీంతో ఓట్లేసిన ప్రజలు తిరుగుబాటు చేయడంతో పరారవ్వాల్సి వచ్చింది.
ఇప్పుడు శ్రీలంకలో జరుగుతున్న నిరసనల్లో గోటబయకు ఓట్లేయని వారు మాత్రమే పోరాడటం లేదు. వారు ప్రతిపక్షాలు అని ఎవరూ ముద్ర వేయడం లేదు. తప్పుడు సమాచారం ఇస్తున్నారని అక్కడిమీడియాపై ఎవరూ నిందలేయడం లేదు. ఎందుకంటే అంత స్వేచ్చను వారు కోల్పోయారు. ప్రజాస్వామ్యంలో నియంత స్వామ్యానికి అలవాటు ప్రజల్ని.. తమను ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి తాము ఏం చేసినా ప్రజలు అంగీకరించినట్లే అనుకుంటే చివరికి ఇదే గతి పడుతుంది. ప్రపంచంలో అనేక ప్రజాస్వామ్యదేశాలున్నాయి. అన్ని దేశాలకూ శ్రీలంక పరిణామాలు ఓ గుణాపాఠమే. నేర్చుకుంటే సరే లేకపోతే..అలా తట్టాబుట్టా సర్దుకుని పారిపోవాల్సిందే.