హైదరాబాద్: అమరావతిలో రాజధాని నిర్మాణంవల్ల పర్యావరణానికి తీవ్రముప్పు వాటిల్లుతుందంటూ సుప్రీంకోర్ట్‌ను ఆశ్రయించిన పర్యావరణవాది, సీనియర్ జర్నలిస్ట్ పండలనేని శ్రీమన్నారాయణ – తన ప్రాణాలకు ముప్పు ఏర్పడిందని, రక్షణ కల్పించాలని కోరారు. మొన్న అమరావతి శంకుస్థాపన జరిగిన మరసటిరోజు, ఈనెల 23 ఉదయం – కొంతమంది, విజయవాడలోని తన ఇంట్లోకి చొరబడి, కేసు ఉపసంహరించుకోవాలని హెచ్చరించారని పండలనేని చెప్పారు. తాను ఉపసంహరించుకోనని చెప్పగా, రెండోకాలుకూడా తీసేస్తామని, అవసరమైతే లేపేస్తామంటూ బెదిరించారని తెలిపారు(పండలనేనికి ఎడమ కాలు పనిచేయదు). దీనిపై తాను విజయవాడ పోలీసులను ఆశ్రయించినప్పటికీ ఉపయోగంలేకుండాపోయిందని చెప్పారు. దీనితో కేసు నమోదుచేయాలని పోలీసులకు ఆదేశాలిమ్మంటూ కోర్ట్‌ను ఆశ్రయించాలనుకుంటున్నట్లు తెలిపారు.
మరోవైపు ఈ ఆరోపణలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ ఖండించారు. ఏపీ ప్రభుత్వం పర్యావరణవాదులపై ఎలాంటి అణచివేత చర్యలకూ పాల్పడదని చెప్పారు. తమది ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకోబడిన ప్రభుత్వమని, తాము అలాంటి పనులు చేయబోమని చెప్పారు. కోర్టలలో, వివిధ ఫోరమ్‌లలో పోరాడేవారిపట్ల తమకు గౌరవం ఉందని అన్నారు.
అమరావతిని సారవంతమైన, పంటలుపండే భూములపై నిర్మిస్తున్నారని, అదికూడా వరదలు సంభవించటానికి అవకాశమున్న ప్రాంతంలో నిర్మిస్తున్నారని, రాజధాని నిర్మాణంకోసం కోటి చెట్లను నరికి అర్బన్ జంగిల్ నిర్మిస్తున్నారని ఆరోపిస్తూ శ్రీమన్నారాయణ సుప్రీంకోర్ట్‌లో వ్యాజ్యం దాఖలు చేశారు. సుప్రీం కోర్ట్ ఈ కేసును నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్‌కు బదిలీ చేసింది. గ్రీన్ ట్రైబ్యునల్ ఈ కేసును పరిశీలించి, పర్యావరణ అనుమతులు అన్నీ మంజూరయ్యేవరకు అమరావతి నిర్మాణపనులను నిలిపేయాలంటూ శంకుస్థాపకు రెండువారాలముందు స్టే విధించింది. గ్రీన్ ట్రైబ్యునల్ ఇప్పటివరకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోయినా ప్రభుత్వం శంకుస్థాపనను చేసేసింది.
మరోవైపు, శ్రీమన్నారాయణ మొన్న 27వ తేదీన హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ పెట్టి తనకు వచ్చిన బెదిరింపులగురించి చెప్పినప్పటికీ అది మీడియాలో ఎక్కడా ప్రధానంగా ప్రస్తావించబడకపోవటం విశేషం. రాయలసీమ హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖరరెడ్డి పండలనేనికి అండగా ఉంటానని ఆ ప్రెస్ మీట్లో ప్రకటించారు. చంద్రబాబు ప్రభుత్వంపై (సిఆర్డిఏ చైర్మెన్ హోదాలో చంద్రబాబుపైనా, సిఆర్డిఏ కమీషనర్ పైనా) జాతీయ గ్రీన్ ట్రిబ్యూనల్‌లో కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారంటూ ఒక క్రిమినల్ ప్రొసీడింగ్ వేస్తామని బైరెడ్డి చెప్పారు. పండలనేని శ్రీమన్నారాయణకు ఏదైనా జరిగితే, దానికి చంద్రబాబు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.
ఇదిలా ఉంటే, నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్‌లో అమరావతి నిర్మాణానికి వ్యతిరేకంగా, పోలవరం ప్రాజెక్ట్‌కు వ్యతిరేకంగా కేసులు వేయిస్తున్నది జగనేనని ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ ఆరోపించారు. పరోక్షంగా, పండలనేని వెనక ఉన్నది జగన్ అని ఉమా అంటున్నారు. దీనిలో నిజమెంతో కాలమే చెప్పాలి.