పవన్‌కల్యాణ్ చేత ‘లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కే వేరప్పా’ అని ‘అత్తారింటికి దారేది’లో డైలాగ్ చెప్పించారు త్రివిక్రమ్. సినిమాలు చూడటంలో ప్రేక్షకులదీ ఇంచుమించు సేమ్ థియరీ! సినిమా చివర్లో… అదేనండీ క్లైమాక్స్‌లో కిక్ ఇచ్చే సన్నివేశాలు వుంటే అంతకుముందున్న చిన్న చిన్న తప్పుల్ని క్షమించేస్తారు. వేసవిలో భోజనం చివర్లో మీగడ పెరుగుతో మామిడికాయ నంజుకుని తిన్నంత సంబరపడతారు. నితిన్, రాశి ఖన్నా జంటగా సతీష్ వేగేశ్న దర్శకత్వంలో వస్తోన్న ‘శ్రీనివాస కల్యాణం’ క్లైమాక్స్ కూడా ప్రేక్షకులకు అంతే కిక్ ఇస్తుందట! అసలు సినిమాకి క్లైమాక్సే కీలకంగా నిలుస్తుందని సినిమా చూసినవారు చెప్తున్నారు. యూనిట్ సభ్యులకు ఆదివారం రాత్రే సినిమా చూపించారు నిర్మాత దిల్‌రాజు. ఫస్టాఫ్‌లో ఎక్కువ శాతం నితిన్, రాశి ఖన్నా మధ్య నడిచే ప్రేమకథే ఉంటుందని తెలుస్తోంది. సెకండాఫ్‌లో పెళ్లి తంతు వగైరా వగైరా ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని చెప్తున్నారు. క్లైమాక్స్ సీన్, అందులో నితిన్ చెప్పే డైలాగులు సినిమాకి హైలైట్‌గా నిలుస్తాయట! సినిమాలో విలన్ ఎవరూ లేరు. పరిస్థితులే కథను ఆసక్తికరంగా ముందుకు నడిచేలా చేశాయట! గురువారం విడుదలవుతోన్న ఈ సినిమాపై నిర్మాత దిల్‌రాజు చాలా నమ్మకంగా వున్నారు. నితిన్ అయితే తన కెరీర్లో టాప్ ఫిల్మ్ అవుతుందని ఘంటాపథంగా చెప్తున్నాడు.