మంచి రసగుల్ల లాంటి సినిమా అంటూ ఊరించిన శ్రీనివాసరెడ్డి ఇప్పుడు గల్లైపోయాడు. అవును… ఆయన దర్శకుడిగా మారి తెరకెక్కించిన చిత్రం `భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు`. దీనికి నిర్మాత కూడా శ్రీనివాసరెడ్డినే. `మంచి రసగుల్ల లాంటి సినిమా` అంటూ క్యాప్షన్ పెట్టారు. శుక్రవారం విడుదలైన ఈ సినిమా డిజాస్టర్ టాక్ మూటగట్టుకుంది. థియేటర్లో జనమే లేకుండా పోయారు. 2 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించిన సినిమా ఇది. దిల్ రాజుని బతిమాలు కోవడంతో 70 థియేటర్ల వరకూ వచ్చాయి. వాటిలో ఇప్పుడు జనమే లేరు. ఈ సినిమాపై పెట్టిన 2 కోట్లూ పోయినట్టే. థియేటర్లకు అద్దెలు ఎదురు చెల్లించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.
మనకున్న మంచి హాస్య నటుల్లో శ్రీనివాసరెడ్డి ఒకడు. తన టైమింగ్ భలే బాగుంటుంది. అందుకే బిజీ బిజీగా గడుపుతుంటాడు. కానీ.. దర్శకత్వం చేయాలన్న కోరిక పుట్టి, మహేష్‌బాబు సినిమాలో (సరిలేరు నీకెవ్వరు) నటించే అవకాశం వచ్చినా, కాదనుకుని ఆ గ్యాప్‌లో ఈ సినిమా తీశాడు. ఇప్పటి వరకూ తాను సంపాదించినదంతా పెట్టుబడిగా పెట్టాడు. సత్య, షకలక శంకర్‌తో పాటు చాలామంది హాస్య నటుల్ని తీసుకొచ్చాడు. వాళ్ల పారితోషికాల్లో 25 శాతం మాత్రమే చెల్లించి, మిగిలినవి లాభాలొస్తే ఇస్తా అన్నాడు. ఇప్పుడు వాళ్లకూ డబ్బులు ఇవ్వలేని పొజీషన్‌కి వచ్చాడు. అలా దర్శకత్వ కల… కోసం 2 కోట్లు పణంగా పెట్టాల్సివచ్చింది.