అల్లరి నరేష్ కెరీర్ బొత్తిగా తిరోగమన దశలో ఉంది. నాన్న ఈవీవీ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. ఆయనే ఉండి ఉంటే, తనయుడి కోసం… తమాషా కథలు రాసుకునేవారు. ఏదోలా లైఫ్ ఇచ్చేవారు. అయితే ఈవీవీ ఇది వరకే కొన్ని లైన్లు రెడీ చేసి పెట్టుకున్నాడు. అందులో ఒకటి ‘పంబలకిడి జంబ’. సీనియర్ నరేష్ హీరోగా వచ్చిన జంబలకిడి పంబకి ఇది సీక్వెల్ అన్నమాట. ఈవీవీ మంచి ఫామ్‌లో ఉన్నప్పుడే నరేష్‌తో ఈ సినిమా చేద్దామనుకున్నారు. కానీ కుదర్లేదు. ఈమధ్య నరేష్ ఈ స్ర్కిప్టుపై దృష్టి పెట్టినట్టు సమాచారం. నాన్న ఆరోజుల్లో తనకు చెప్పిన లైన్ పట్టుకొని, ఇప్పటి ట్రెండ్‌కు తగినట్టుగా కథ అల్లుకున్నాడట. అది ఓ యువ దర్శకుడి చేతిలో పెట్టి సినిమాగా తీద్దామనుకున్నాడు.
అయితే ఇంతలోనే ఈ ఆశలకు శ్రీనివాసరెడ్డి గండి కొట్టాడు. తనే ‘జంబలకిడి పంబ’ పేరుతో ఓ సినిమా పట్టాలెక్కించేస్తున్నాడు. దీనికి మను దర్శకత్వం వహిస్తారు. నరేష్ అనుకున్న కథకీ ఈ కథకీ పొంతన లేదు గానీ.. ఆ టైటిల్‌ని మళ్లీ నరేష్ వాడుకునే వీలు ఉండదు. టైటిల్లోనే బోల్డంత కిక్ ఉంది కాబట్టి… ఆ టైటిల్‌ని వదిలేసి మరో టైటిల్‌ని ఎంచుకోవడం పెద్ద రిస్క్. అందుకే నరేష్ తన కథని పక్కన పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. పాత టైటిళ్లు వాడుకోవాలంటే… సదరు టైటిల్ పెట్టిన దర్శకుడినో, నిర్మాతనో పర్మిషన్ తీసుకోవాలి. ఈవీవీ లేరు కాబట్టి ఆయన వారసుల్ని అడగాలి. ఇదేం రూలు కాదు. కానీ.. గౌరవ సూచకం. మరి శ్రీనివాసరెడ్డి టీమ్ ఇందుకు గానూ పర్మిషన్ తీసుకుందో, లేదో తెలియాల్సివుంది.