ఎవరి కెరీర్లో అయినా ఒక్క సినిమా చాలు. తారాపథంలో దూసుకుపోవాలన్నా, అథపాతాళంలో కూరుకుపోవాలన్నా. శ్రీనువైట్ల కెరీర్లో అలాంటి సినిమా ‘ఆగడు’. ‘దూకుడు’లాంటి సూపర్ డూపర్ హిట్ తరవాత మహేష్ బాబుతో శ్రీనువైట్ల చేసిన సినిమా ఇది. విడుదలకు ముందు… ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో ఉండేవి. కానీ… కనీవినీ ఎరుగని రీతిలో ఈ సినిమా డిజాస్టర్ ఖాతాలో చేరిపోంది. ఈ ఫ్లాప్ నుంచి శ్రీనువైట్ల ఇప్పటికీ కోలుకోలేకపోయాడు. అక్కడ్నుంచి శ్రీనుకి అన్నీ ఫ్లాపులే. శ్రీనువైట్ల కూడా తన కెరీర్లో చేసిన అతి పెద్ద తప్పు సినిమానే అని నిర్మొహమాటంగా ఒప్పుకొన్నాడు. ఈ సినిమా విషయంలో చాలా తప్పులు చేశానని, ఆ తప్పులన్నింటికీ కారణం తనే నని మీడియా ముఖంగా అంగీకరించాడు.
నిజానికి ‘ఆగడు’ కథ మనం చూసింది కాదట. శ్రీనువైట్ల వేరే కథ రాసుకొన్నాడట. అది చాలా పెద్ద స్పాన్ కథ అని, మహేష్‌కి విపరీతంగా నచ్చిందని, అయితే బడ్జెట్ కూడా ఎక్కువ అవుతుందని, అంత పెట్టుబడి పెట్టడానికి నిర్మాతలు భయపడితే, మరో సెటప్ లో ‘ఆగడు’ కథ తీయాల్సివచ్చిందని, అక్కడే పెద్ద తప్పు చేశానని ఒప్పుకొన్నాడు శ్రీనువైట్ల. ఆ కథ ఇప్పటికీ తన దగ్గర ఉందని, కానీ సినిమాగా మాత్రం చేయలేనని, ఎప్పటి కథలు అప్పటికే వర్కవుట్ అవుతాయని, అందుకే ఆ కథ పూర్తిగా పక్కన పెట్టేశానని చెప్పుకొచ్చాడు శ్రీనువైట్ల. ఇప్పుడు గోపీచంద్ తో ‘విశ్వం’ అనే చిత్రాన్ని రూపొందించాడు. వచ్చేవారం విడుదలకు సిద్ధమైంది. దసరా సీజన్లో వస్తున్న సినిమా ఇది. టీజర్ లో శ్రీనువైట్ల మార్క్ కామెడీ టింజ్ కనిపిస్తోంది. శ్రీనువైట్ల బలం వినోదం. దాన్ని పట్టుకొంటే చాలు, వైట్ల హిట్టు కొట్టినట్టే. మరి ‘విశ్వం’తోనైనా తాను సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడో లేదో చూడాలి.