విలన్ ఇంట్లో హీరో తిష్ట వేసుకుని కూర్చోవడం, తెలివైన విలన్ ని బకరా చేయడం – శ్రీనువైట్ల స్టైల్. ఈ ఫార్ములాలో శ్రీనువైట్ల తీసిన సినిమాలన్నీ బాగా ఆడాయి. కాకపోతే.. ఈ ఫార్ములాని మిగిలిన దర్శకులూ పట్టుకుని ఎడా పెడా వాడేశారు. దాంతో మొహం మొత్తేసింది. ఇప్పుడు బెల్లంకొండ శ్రీనివాస్ కూడా ఈ తరహా కథే ఎంచుకున్నాడు.
సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో బెల్లంకొండ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. నభా నటేశా కథానాయికగా నటిస్తోంది. ఇందులో అను ఇమ్మానియేల్ మరో నాయికగా ఎంపికైంది. ఈ కథలో కూడా విలన్ని హీరో బకరా చేయడమే మెయిన్ పాయింట్. కాకపోతే ఒక్క విలన్ కాదు. ఇందులో ఇద్దరు విలన్లు ఉన్నారు. సోనూసూద్, ప్రకాష్రాజ్లను బెల్లంకొండ ఎలా బకరాల్ని చేసి ఆడుకున్నాడన్నదే ఈ సినిమా పాయింటు. అయితే దానికే కొత్త రకమైన ట్రీట్ మెంట్ ఇస్తున్నాడట సంతోష్ శ్రీనివాస్. వినోదానికి పెద్ద పీట వేశారని, హీరో క్యారెక్టరైజేషన్ కొత్తగా ఉంటుందని, దాంతో పాత ఫార్ములా కథైనా వర్కవుట్ అయిపోతుందన్న నమ్మకంలో ఉన్నాడు బెల్లంకొండ. వేసవిలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.