సీక్వెల్స్ హావా తెలుగులో జోరుగానే ఉంది. దానికి తోడు ఇప్పుడు పార్ట 2లు సీజన్ కూడా నడుస్తోంది. శ్రీనువైట్ల `ఢీ`కి సీక్వెల్ వస్తుందని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. శ్రీనువైట్ల – విష్ణు కాంబినేషన్ లో `డీ అండ్ డీ` అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. అయితే.. అందరూ అనుకుంటున్నట్టు ఇది `ఢీ`కి సీక్వెల్ కాదు. పూర్తిగా వేరే కథ. అసలు `ఢీ`కీ ఈ కథకూ సంబంధమే లేదు. ఈ విషయాన్ని శ్రీనువైట్ల కూడా ధృవీకరించేశారు. “ఢీకి ఇది సీక్వెల్ కాదు. ఆ కథలోని లక్షణాలు ఇందులో ఏమాత్రం కనిపించవు. అయితే.. క్యారెక్టరైజేషన్లలో మాత్రం ఢీ ఫ్లేవర్ కనిపిస్తుంది. సినిమా చూస్తున్నప్పుడు ఏదో ఓ క్షణంలో.. ఢీ గుర్తొస్తుందంతే..“ అని క్లారిటీ ఇచ్చారు. తనకు సీక్వెల్స్ అంటే ఇష్టం ఉండదని, మ్యాజిక్ అనేది ఒకేసారి రిపీట్ అవుతుందని చెప్పుకొచ్చాడు శ్రీనువైట్ల.
దూకుడుకి సీక్వెల్ వస్తుందని అప్పట్లో ప్రచారం జరిగింది. దీనిపై కూడా శ్రీనువైట్ల క్లారిటీ ఇచ్చేశాడు. “దూకుడు 2 రాదు. అసలు ఆ ఆలోచనే నాకు లేదు. ఎప్పుడైనా సరే, కొత్త కథలతోనే మ్యాజిక్ చేయగలం. మహేష్ దగ్గరకు మరోసారి వెళ్తే.. దూకుడు కంటే మంచి కథతో వెళ్లాలి..“ అని చెప్పుకొచ్చాడు శ్రీనువైట్ల. సో.. శ్రీనువైట్ల చేస్తోంది ఢీ 2 కాదన్నది థియేటర్లకు వెళ్లే ముందు ప్రేక్షకులు గుర్తుంచుకుంటే మంచిది.