సినిమా కథలేవీ రామాయణ మహాభారతాల్ని దాటి వెళ్లలేదేమో అనిపిస్తుంటుంది. ఏ కథైనా తీసుకోండి, ఏ పాత్ర తీసుకోండి – వీటికి ఎక్కడో ఓ చోట లింకు ఉంటుంది. అంతలా సినిమా వాళ్లని పట్టేశాయి. బాపు నుంచి మణిరత్నం వరకూ – మహా దర్శకులు అనదగ్గరవాళ్లంతా రామాయణాన్ని ఔపోశాన పట్టేశారు. బహుశా… రామాయణం ప్రస్తావన లేకుండా వాళ్లిద్దరూ ఏ కథనీ రాయలేదేమో.? తెలుగు పాటల్లోనూ రామాయణ గాథ వినిపించడంలో దర్శకులు పోటీ పడుతుంటారు. అయితే.. రామాయణాన్ని సింపుల్గా కట్టె.. కొట్టె.. తెచ్చె లా మూడు ముక్కల్లో, సరళంగా, మధురంగా చెప్పేసిన సోషలైజ్ పాటలూ మనకు కనిపిస్తాయి, వినిపిస్తాయి. అలాంటి పాటలు వినగానే.. అరె.. రామాయణాన్ని అందరికీ అర్థమయ్యేలా భలే చెప్పారే అనిపిస్తుంది. అలాంటి కొన్ని పాటల్ని ఈరోజు శ్రీరామ నవమి సందర్భంగా గుర్తు చేసుకుంటే…
ఈమధ్య కాలంలో రామాయణాన్ని మూడు ముక్కల్లో, ముచ్చటైన మాస్ పాటలో మేళవించడం ‘శ్రీమంతుడు’లో కనిపించింది.
”రాములోడు వచ్చినాడురో
దీన్తస్సదియ్య… శివధనస్సు ఎత్తినాడురో” పాటంతా రామాయణమే. రామజోగయ్య శాస్త్రి భలేగా రాశారు. రామాయణ తత్వాన్ని మాస్ పాటలో ఇరికించడం అంత తేలికైన విషయం కాదు. ఓ పక్క బీటు, మరో పక్క స్టెప్పులతో సాగే ఈ పాట మాస్కి బాగా నచ్చేసింది.
రాజ్యమంటే లెక్కలేదురో.. దన్తస్సదియ్య అడవిబాట పట్టినాడురో
పువ్వులాంటి సక్కనోడురో.. దన్తస్సదియ్య సౌఖ్యమంత పక్కనెట్టెరో
జీవుడల్లె పుట్టినాడురో.. దేవుడల్లె ఎదిగినాడురో
నేలబారు నడచినాడురో.. పూల పూజలందినాడురో
పదపదమని వంతెనేసి పెనుకడలిని దాటినాడు
పది పది తలలున్నవాడ్ని పట్టి తాట తీసినాడు
చెడుతలపుకి చావుదెబ్బ తప్పదని చూపినాడురో.. – ఇలా ప్రతి పదంలోనూ, ప్రతీ వాక్యంలోనూ రామాయణాన్ని ప్రతిబించించాడు.
‘అల్లుడా మజాకా’ లాంటి ఫక్తు మాస్ సినిమాలోనూ ఓ శ్రీరామనవమి గీతం ఉంది.
మా ఊరి దేవుడు – అందాల రాముడు
మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు అంటూ సాగే ఈ పాటలో శ్రీరామమహినాన్వితమే సరళమైన పదాల్లో వినిపిస్తుంది.
రాతినైన రాతిగ చేసి
కోతినైన దూతగ పంపే మ హిమే నీ కథ రామా
ఓ మాట ఓ సీత ఓ బాణమన్నావు
ధర్మానికే నీవు దైవానివయ్యావు
అన్నంటే నీవంటు ఆదర్శమయ్యావు
తమ్ముళ్లకే నీవు కన్నీళ్లు తుడిచావు
ఆకాశ పందిళ్లు – భూలోక సందళ్లు
ఓ రామ నీ పెళ్లికే!! – ఇలా రాముడిలోని గొప్ప గుణాల్ని సింపుల్ఫైజ్ చేసి రాశారు వేటూరి సుందర్రామ్మూర్తి.
‘దేవుళ్లు’ సినిమాలో పాటలన్నీ హిట్టే. అందులో ‘అందరి బంధువయా.. భద్రాచల రామయ్యా’ అయితే ఎవర్ గ్రీన్. రాముడి పాటంటే… నవతరం తప్పకుండా ఈ పాటని గుర్తు చేసుకుంటుంది. పాట అంత సింపుల్గా ఉంటుంది మరి. ఆ హనుమంతుడే దిగి వచ్చి, పిల్లలకు రాముడి గొప్పదనం చెప్పే గీతమిది.
తెల్లవారితే చక్రవర్తియై రాజ్యమలే మా రామయ్యా
తండ్రి మాట విని పదవులనొదిలి అడవులకేగినయా
అఖిలో జనులను కావగ వచ్చిన మహా విష్ణు అవతారమయా
ఆలిని రక్కసుడు అపహరించితే ఆక్రోశించెనయా – ఇలా పదం పదం రామ విశిష్టతతో నింపేశారు.
ఆనాటి ‘మీనా’ చిత్రంలో ‘శ్రీరామ నామాలు శతకోటి ఒకొక్క పేరూ బహుతీపి’ పాటనీ ఈ సందర్భంలో గుర్తు చేసుకోవాల్సిందే. ప్రకాష్ రాజ్ దర్శకత్వంలో వచ్చిన ‘మన వూరి రామాయణం’ లోని టైటిల్ గీతం కూడా ఎన్నదగినదే. స్వాతి ముత్యంలో ‘రామా కనవేమిరా’లో మొత్తం రామాయణమే ధ్వనిస్తుంది. ‘నిన్నటి దాకా శిలనైనా నీ పదము సోకి నే గౌతమినైనా’ (మేఘసందేశం) ‘రాయినైనా కాకపోతిని రామపాదము సోకగా’ (గోరంత దీపం).. ఇవన్నీ రామ స్మరణలే.
ఇలా ప్రతీ పాటా రాముడి గొప్పదనాన్నీ రామాయణ విశిష్టతనీ తెలిపేదే. మనల్ని రాముడి స్మరణలో ముంచెత్తేదే. ఈ పాటల్లో విశిష్టత అంతా రామాయాణాన్ని సాధారణమైన ప్రేక్షకుడికి అర్థమయ్యేలా చెప్పడమే. అందుకే… చరిత్రలో మిగిలిపోయాయి.