ప్రభుత్వం గత కొద్ది రోజులుగా అర్థరాత్రుళ్లు రహస్య జీవోలు విడుదల చేస్తోంది. వాటిలోని వివరాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇలా జారీ చేసిన ఓ జీవో.. స్టేట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్పొరేషన్ ఏర్పాటుకు సంబంధించినది. ఈ జీవో వెలుగులోకి వచ్చింది. ఇందులో వివరాలు చూసిన వారికి.. ఆర్థిక వ్యవహారాలు అర్థమైన వారికి… ఒక్కటే వినిపిస్తోంది.. అదే గోవింద.. గోవింద అనే నామస్మరణ. స్టేట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్పొరేషన్‌ను 2013 కంపెనీల చట్టం ప్రకారం ఏర్పాటు చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఈ సంస్థకు నిధులు ప్రభుత్వ కార్పొరేషన్లు, ట్రస్టులు, విశ్వవిద్యాలయాలు, ప్రాధికార సంస్థలు… చివరిగా… దేవాలయాల నుంచి కూడా సేకరిస్తారు.
ప్రస్తుతం ఏపీలో డబ్బులు పోగుపడిపోయిన ప్రభుత్వ కార్పొరేషన్లు, విశ్వవిద్యాలయాలు, ప్రాధికార సంస్థలు లేవు. కానీ దేవాలయాలు, ట్రస్టుల వద్ద మాత్రం కాస్త డబ్బు ఉంటుంది. ట్రస్టుల వద్ద డబ్బు లేకపోయినా ఆస్తులుంటాయి. వీటి నుంచి నిధుల సేకరణతోపాటు కార్పొరేషన్ల మధ్య డిపాజిట్లు, డిబెంచర్లు, దీర్ఘ, మధ్య, స్వల్పకాలిక పెట్టుబడులుగా సేకరించం ఈ కార్పొరేషన్ పనుల్లో ఒకటి. ఇలా సేకరించిన నిధులను ఏం చేస్తుందంటే.. కేంద్ర ప్రభుత్వ సెక్యూరిటీలు, ట్రెజరీ బిల్లులు, రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికలు, బాండ్లు, కేంద్ర ప్రభుత్వ రంగ కార్పొరేషన్లలో పెట్టుబడులు పెడుతుంది. మిగతా వాటి సంగతేమో కానీ.. ట్రెజరీ బిల్లు, రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికలు అనే రెండింటింటితో.. మొత్తం నిధుల్ని కవర్ చేస్తారనే అభిప్రాయం.. ఆర్థిక నిపుణుల్లో వ్యక్తమవుతోంది.
సంక్షేమ పథకాలు అమలు జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిధుల సమీకరణ కోసం అపసోపాలు పడుతుంది. రుణ పరిమితి తగ్గిపోయింది. అందుకే నిధుల సమీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్త ప్రయత్నాలు ప్రారంభించింది. సంక్షేమ పథకాలకు నిధుల సౌలభ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ కొత్త సంస్థను ఏర్పాటు చేసింది. దీనికి ఆర్బీఐ పర్మిషన్ తీసుకోవాల్సి ఉంది.