బాలీవుడ్ లో మంచి విజయాన్ని అందుకున్న చిత్రం `అంధాధూన్`. తెలుగులో నితిన్ తో రీమేక్ చేస్తున్నారు. మేర్లపాక గాంధీ దర్శకుడు. అయితే… హిందీలో టబు చేసిన పాత్రకు తెలుగులో మంచి ఆప్షన్ దొరకడం లేదు. నయనతార ని సంప్రదిస్తే… భారీ పారితోషికం చెప్పి, బెంబేలెత్తించింది. టబునే అడిగితే `చేసిన పాత్ర మళ్లీ చేయను` అని ఖరాఖండీగా చెప్పేసింది. చివరికి ఈ పాత్ర లో నటించడానికి శ్రియ ఒప్పుకుందని ప్రచారం మొదలైంది.
దీనిపై శ్రియ క్లారిటీ ఇచ్చేసింది. ”ఈ ప్రాజెక్టు నా దగ్గరకు వచ్చిన మాట నిజమే. టబు పాత్రలో నటించడం గొప్ప గౌరవంగా భావిస్తా. కాకపోతే నేను ఇప్పుడు బార్సిలోనాలో ఉన్నాను. షూటింగ్ మొదలయ్యేసరికి నేను ఇండియా రాగలనా? లేదా? అనే విషయాలు ఆలోచించుకోవాలి. ప్రస్తుతం కరోనా అందరినీ భయపెడుతోంది. షూటింగ్ మొదలయ్యేసరికి పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పలేను. ఒకవేళ అనుకూలంగా ఉంటే మాత్రం.. తప్పకుండా ఈ పాత్రని వదులుకోను..” అని క్లారిటీ ఇచ్చింది. ‘ఆర్.ఆర్.ఆర్’లోనూ శ్రియ ఓ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈసినిమాలో తన పాత్ర నిడివి చాలా తక్కువ అంటోంది శ్రియ. అదో అతిథి పాత్ర అని, చరణ్, ఎన్టీఆర్ తో తనకు కాంబినేషన్ సీన్లు లేవని తేల్చేసింది.