చిత్రసీమలో ఎలాంటి కాంట్రవర్సీలూ లేకుండా నెట్టుకురావడం చాలా అరుదైన విషయం. పైగా కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడు. ఎస్.ఎస్.రాజమౌళి ఈ విషయంలో అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఆయనపై ఇప్పటి వరకూ ఒక్క ఆరోపణ లేదు. క్లీన్ ఇమేజ్ ఉన్న వ్యక్తి ఆయన. అలాంటి జక్కన్న కూడా ఇప్పుడు ఓ కాంట్రవర్సీలో చిక్కుకోవడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.
జక్కన్న స్నేహితుడు యూ.శ్రీనివాసరావు ఓ సెల్ఫీ వీడియో విడుదల చేశారు. ఇది తన మరణవాంగ్మూలమని చెప్పడం కలకలం రేపుతోంది. ఇద్దరూ స్నేహితులమని, యమదొంగ సినిమాకి ఎగ్జిక్యూటీవ్ ప్రొడ్యూసర్‌గా పని చేశానని చెప్పుకొచ్చాడాయన. కెరీర్ ప్రారంభంలో తానూ, రాజమౌళి ఒకే అమ్మాయిని ప్రేమించామని, ఆ అమ్మాయి విషయంలో తాను త్యాగం చేశానని, అయితే ఆ విషయం తానెక్కడ బయటకు చెప్పేస్తానేమో అని భయపడి, తనని అన్ని విధాలా టార్చర్‌కి గురి చేస్తున్నాడని, ఈ టార్చర్ భరించడం కంటే చచ్చిపోవడమే నయం అనే నిర్ణయం తీసుకొన్నానని ఈ వీడియోలో చెప్పుకొచ్చారు శ్రీనివాసరావు. రాజమౌళికి లై డిటెక్టర్ పరీక్ష నిర్వహించాలని, ఈ వీడియోని సుమోటోగా తీసుకొని, రాజమౌళిని విచారించాలని ఆయన న్యాయస్థానాన్ని కోరారు.
ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. ఇందులో ఉన్న వ్యక్తి ఎవరు? ఆయన చెబుతున్నవన్నీ నిజాలేనా? లేదంటే కేవలం పబ్లిసిటీ కోసమే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారా? అనే విషయాలు తెలియాల్సివున్నాయి. ఏదేమైనా ఇప్పటి వరకూ రాజమౌళి క్లీన్ ఇమేజ్ తోనే ఉన్నారు. ఆయన పరువు, ప్రతిష్టకు ఇది భంగం కలిగించే అంశమే. దీనిపై రాజమౌళి ఎలా స్పందిస్తారో చూడాలి. ప్రస్తుతానికైతే ఏ పోలీస్ స్టేషన్లోనూ కేసు నమోదు అవ్వలేదని, హై ప్రొఫైల్ కేస్ కాబట్టి, పోలీసులు అన్ని రకాలుగా విచారించే తదుపరి స్టెప్ తీసుకొంటారని తెలుస్తోంది.