ఎన్టీఆర్ – చరణ్‌లతో పాటు అజయ్‌దేవగణ్, సముద్రఖని పేర్లు కూడా ప్రకటించేశాడు రాజమౌళి.. ఆర్.ఆర్.ఆర్ కోసం. అయితే అటు అజయ్ దేవగణ్ గానీ, ఇటు సముద్రఖని కానీ ప్రతినాయకులు కారు అని తేల్చేశాడు. అయితే.. ఇప్పుడు ఆ పాత్ర ఎవరికి దక్కబోతోంది? అనే ఆసక్తి నెలకొంది. కథానాయికల్ని సైతం నిర్ణయించేసిన రాజమౌళి.. ప్రతినాయకుడి దగ్గరే తర్జనభర్జనలు పడుతున్నాడు. రాజమౌళి సినిమాల్లో ప్రతినాయకుడి పాత్రకు చాలా ప్రాధాన్యం ఉంటుంది. హీరోతో పాటు సమానంగా ఆ పాత్ర తీర్చిదిద్దుతాడు. ఇక్కడ ఇద్దరు స్టార్ హీరోలుంటే, ప్రతినాయకుడి పాత్ర ఇంకెంత బలంగా, శక్తివంతంగా ఉండాలి? ఆ పాత్రలో పాపులర్ నటుడు కనిపించాలి.
అయితే… ఈసారి మాత్రం రాజమౌళి ప్రతినాయకుడి పాత్ర కోసం ఓ ప్రయోగమే చేయబోతున్నాడు. ఎవరికీ తెలియని ఓ వ్యక్తిని తెరపైకి తీసుకురాబోతున్నాడు. అందుకోసం ప్రస్తుతం ఆడిషన్స్ జరుగుతున్నట్టు సమాచారం. ఇప్పటి వరకూ తెలుగు తెరకు కనిపించని నటుడే.. ప్రతినాయకుడిగా దర్శనమిస్తాడని తెలుస్తోంది. బాలీవుడ్, హాలీవుడ్ నుంచి కూడా ఓ అనామక నటుడ్ని.. దిగుమతి చేసే ఆలోచన కూడా ఉంది. త్వరలో అహ్మదాబాద్‌లో జరిగే షెడ్యూల్ తో ప్రతినాయకుడి పాత్రని రంగంలోకి దింపుతారు. ఈలోగా అతనెవరన్నది తేలిపోతుంది.