తుని విద్వంసానికి కారకులైనవారిని విడిచిపెట్టబోమని, మున్ముందు ఇంకా చాలా మందిని అరెస్ట్ చేయబోతున్నట్లు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి చిన రాజప్ప చెప్పారు. ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడేవారి పట్ల ప్రభుత్వం కటినంగా వ్యవహరించకపోతే అది తప్పుడు సంకేతాలు పంపినట్లవుతుందని అన్నారు. పోలీసులు అరెస్ట్ చేసినవారందరూ గతంలో వివిధ పోలీస్ స్టేషన్లలో రౌడీ షీటర్స్ గా పోలీసుల రికార్డులలో ఉన్నవారేనని మంత్రి తెలిపారు. వారిలో కొందరికి వైకాపా నేతలతో సంబంధాలున్నట్లు గుర్తించమని తెలిపారు. ఈ విద్వంసానికి ఎవరు కుట్ర పన్నారో ఇంకా కనుగొనవలసి ఉందని, వారు ఎంత పెద్ద వారైనా విడిచిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు.
ఈ కేసుని దర్యాప్తు చేస్తున్న సి.ఐ.డి. పోలీసులు తమ అదుపులో ఉన్న వారి వివరాలను వెల్లడించారు. వారిలో దూడల ఫణీంద్ర, దొరబాబు అనే ఇద్దరు గతంలో హత్య కేసులో నిందితులని తెలిపారు. లక్కిం శెట్టి శివ, పవన్ కుమార్ అనే ఇద్దరు ఘటనా స్థలంలో విలేఖరిపై దాడి చేసి అతని సెల్ ఫోన్ లాక్కొన్నారని తెలిపారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని, త్వరలోనే అసలు నేరస్తులను పట్టుకొంటామని తెలిపారు.
పోలీసులు చెపుతున్న దాని ప్రకారం అరెస్టయిన వారిలో కొందరు కరడుగట్టిన నేరస్తులని స్పష్టం అవుతోంది. కానీ వారు అమాయకులని, తక్షణమే విడిచిపెట్టాలని ముద్రగడ పద్మనాభం వాదిస్తున్నారు. ఒకవేళ వారికి ఎటువంటి నేర చరిత్ర లేనట్లయితే పోలీసులు వారిపై అంతటి తీవ్ర నేరలున్నట్లు కట్టుకధలు అల్లలేరు. అల్లినా న్యాయస్థానాల ముందు వాటిని నిరూపించడం చాలా కష్టం. కనుక వారు నేరస్తులా లేక అమాయకులా అనే విషయం తేల్చే బాధ్యత ముద్రగడ తీసుకోకుండా న్యాయస్థానాలకే విడిచిపెడితే మంచిది. ఒకవేళ పోలీసులు చెపుతున్నట్లుగా వారు నిజంగా నేరస్తులని రుజువైతే అటువంటి వారిని వెనకేసుకొని వచ్చినందుకు అప్పుడు ఆయన పశ్చాతాపపడవలసి వస్తుంది.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వ్యక్తిగత విమర్శలు చేస్తుండటం వలన ముద్రగడ తన లక్ష్యాన్ని మరిచి రాజకీయాల వైపు మళ్ళారనే అభిప్రాయం వినబడుతోంది. కనుక ఆయన రాజకీయాలను పక్కనపెట్టి, కాపులకి రిజర్వేషన్లు సాధించడంపైనే తన దృష్టిని కేంద్రీకరిస్తే యావత్ కాపు జాతి ఆయన వెనుక నిలబడుతుంది. లేకుంటే ఆయన విశ్వసనీయతే దెబ్బతింటుంది.