భారత్-పాక్ మధ్య ఏర్పడిన సానుకూల వాతావరణం పఠాన్ కోట్ దాడితో ఆవిరయిపోయింది. ఇరు దేశాలు ఇంకా చాలా సంయమనంగా వ్యవహరిస్తున్నప్పటికీ, ఇప్పుడు ఇరు దేశాల మధ్య ఒకరకంయియన్ స్తబ్దత, గంభీరమయిన వాతావరణం నెలకొని ఉన్నాయి. పఠాన్ కోట్ దాడికి కుట్రపన్నిన వారిపై పాక్ ప్రభుత్వం ఇంతవరకు గట్టి చర్యలు ఏవీ తీసుకోకపోవడంతో భారత్ ఆగ్రహంగా ఉందనే విషయం విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ తాజా ప్రకటనలో వ్యక్తమయింది.
భారత్-పాక్ విదేశాంగ కార్యదర్శుల సమావేశం ఫిబ్రవరి మొదటివారంలో జరుగవచ్చని పాక్ హైకమీషనర్ అబ్దుల్ బాసిత్ చెప్పగానే దానిని వికాస్ స్వరూప్ వెంటనే ఖండించారు. దానిపై ఇరుదేశాలు ఇంతవరకు ఎటువంటి నిర్ణయము తీసుకోలేదని ప్రకటించారు. “పఠాన్ కోట్ దాడికి సంబంధించి పాకిస్తాన్ తో మేము రోజూ మాట్లాడుతూనే ఉన్నాము,” అని తెలిపారు కానీ ఆ వివరాలను తెలపడానికి నిరాకరించారు. త్వరలో ఇరుదేశాల జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం జరుగవచ్చని తెలిపారు. ఆ సమావేశంలో ప్రధానంగా పఠాన్ కోట్ పై జరిగిన దాడి గురించే చర్చించాలనుకొంటున్నట్లు ఆయన తెలిపారు.
పఠాన్ కోట్ పై దాడి జరిగి అప్పుడే దాదాపు నెల రోజులు పూర్తయింది. ఇలాగే మరొక రెండు మూడు నెలలు దీనిని పాక్ సాగదీయగలిగితే క్రమంగా దానిపై ఒత్తిడి కూడా తగ్గిపోవచ్చును. మళ్ళీ అటువంటి ఘటన ఏదో జరిగినప్పుడు మళ్ళీ ఇలాగే హడావుడి చేయడం తప్పించి ఇక భారత్ చేయగలిగిందేమీ ఉండక పోవచ్చును. ఇదే కనుక జరిగితే అది భారత్ దౌత్య వైఫల్యమే అవుతుంది.