ఈ ఏడాది మే16న జరుగబోయే తమిళనాడు శాసనసభ ఎన్నికల కోసం రాజకీయ పార్టీల హడావుడి ఆరు నెలల క్రితం నుంచే మొదలయిపోయింది. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమయిన డిఎంకెతో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల పొత్తులు పెట్టుకొంది. కనుక సీట్ల పంపకాల గురించి చర్చించేందుకు సీనియర్ కాంగ్రెస్ నేతలు ముకుల్ వాస్నిక్, గులాం నబీ ఆజాద్ నిన్న చెన్నై చేరుకొని డిఎంకె పార్టీ అధ్యక్షుడు ఎం. కరుణానిధితో చర్చలు జరిపారు.
కరుణానిధి వృద్దాప్య సమస్యలతో బాధపడుతుండటం, ఆయన కుమారులు ఇద్దరి మధ్య సఖ్యత లేకపోవడం, ముఖ్యమంత్రి జయలలిత ఒక పద్ధతి ప్రకారం డిఎంకె పార్టీని నిర్వీర్యం చేస్తుండటం వంటి అనేక కారణాల వలన డిఎంకె పార్టీ ఈసారి ఎన్నికలలో తప్పనిసరిగా విజయం సాధించి, అధికారంలోకి రావలసి ఉంది. లేకుంటే ఇంక డిఎంకె పార్టీ పతనాన్ని ఎవరూ ఆపలేరు. వృద్ధుడయిన కరుణానిధికి బహుశః ఇవే చివరి ఎన్నికలు కావచ్చును. కనుక ఎలాగయినా ఈ ఎన్నికలలో విజయం సాధించి తన వారసుడయిన చిన్న కొడుకు స్టాలిన్ న్ని అధికార పీఠంపై అధిష్టింపజేయవలసి ఉంటుంది. లేకుంటే అతని రాజకీయ భవిష్యత్ కూడా అంధకారం అయ్యే ప్రమాదం ఉంది. కనుక ఈసారి అత్యధిక స్థానాల నుంచి పోటీ చేసి అధికారం దక్కించుకోవాలని కరుణానిధి భావిస్తున్నారు.
తమిళనాడు శాసనసభలో మొత్తం 235 సీట్లున్నాయి. వాటిలో కనీసం 65 స్థానాలు తమకు కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ నేతలు పట్టుబడుతున్నారు కానీ అందుకు కరుణానిధి అంగీకరించలేదని సమాచారం. ఇరు పార్టీల మధ్య ఎన్నికల పొత్తులయితే ఖరారు అయ్యేయి కానీ సీట్ల పంపకాల విషయంలో ఇంకా అంగీకారానికి రాలేదని ఇరు పార్టీల నేతలు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీకి కరుణానిధి ఎన్ని సీట్లు ఆఫర్ చేసారనే విషయం గోప్యంగా ఉంచేరు. కాంగ్రెస్ పార్టీ నేతలు డిల్లీ వెళ్లి తమ అధిష్టానంతో మాట్లాడిన తరువాత మళ్ళీ కరుణానిధితో మాట్లాడుతామని చెప్పారు.
కాంగ్రెస్ పార్టీకి డిఎంకెతో పొత్తు చాలా అవసరం కనుక 65 సీట్లు కాకపోయినా వీలయినన్ని ఎక్కువ సీట్లు రాబట్టుకొని డిఎంకెతో కలిసి ఎన్నికలకి వెళ్ళడం తధ్యం. ఎన్నికలకు ఇంకా అట్టే సమయం లేదు కనుక నేడో రేపో సీట్ల పంపకాలపై ఇరు పార్టీలు ఒక అవగాహనకు వచ్చే అవకాశాలున్నాయి.