తమిళనాడు సీఎం స్టాలిన్ పరిపాలనలో కొత్త పంథా లిఖిస్తున్నారు. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో కక్ష రాజకీయాలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. కానీ స్టాలిన్ మాత్రం వాటన్నింటినీ వదిలేశారు. అభివృద్ధిపైనే దృష్టి పెట్టారు. అదే సమయంలో రాజకీయంగా తమిళనాడులో వ్యక్తి పూజ అధికంగా ఉంటుంది. నేతలకు సాష్టాంగ ప్రమాణాలు కూడా ఉంటాయి. కానీ ఇప్పుడు స్టాలిన్ కనీసం ఎవరైనా తనను అసెంబ్లీ వేదికగా పొడిగినా సరే చర్యలు తీసుకుంటానని స్పష్టం చేశారు. దీంతో ” నువ్ అనుకుంటే అవుద్ది సామి ” లాంటి డైలాగులను పేపర్ పై రాసుకొచ్చి మరీ అప్పజెప్పాల్సిన పరిస్థితి ఎమ్మెల్యేలకు తప్పిపోయింది. మంత్రి పదవుల కోసం ఇతర అవసరాల కోసం సీఎంను పొడిగేవారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. వారందరికీ స్టాలిన్ చెక్ పెట్టారు.
ఇదే కాదు మూడు రోజుల కిందట అన్నాడీఎంకే రంగులు, జయలలిత, మాజీ సీఎం పళనిస్వామి బొమ్ములు ఉన్న స్కూల్ బ్యాగుల్ని పంపిణీ చేయాలని ఆదేశించారు. గత ప్రభుత్వం తయారు చేయించిన వీటిని సీఎం తీసి పక్కన పడేయమంటారేమోనని అధికారులు అనుకున్నారు. కానీ మరో మాట లేకుండా వృధా చేయకుండా విద్యార్థులందరికీ పంపిణీ చేయాలని స్టాలిన్ ఆదేశించేశారు. ఒకరు ముఖ్యమంత్రి అయితే అప్పటి వరకూ ముఖ్యమంత్రిగా చేసిన నేత గుర్తులు కనిపించకుండా చేయడానికి వేల కోట్లు వృధా చేయడానికి కూడా వెనుకాడని పాలకుల్ని ఇప్పటి వరకూ చూశాం. వారి బొమ్మలు కనిపించే ఏ పథకం అయినా .. ప్రజలకు ఉపయోగపడేదైనా సరే.. నిర్మోహమాటంగా పక్కన పడేసిన వైనం చూశాం.
అందుకే స్టాలిన్ వైఖరి తెలుగు రాష్ట్రాల్లోనూ హాట్ టాపిక్ అవుతోంది. సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత జయలలిత హయాంలో ప్రారంభమైన అమ్మ క్యాంటీన్లను ఆమె పేరుతోనే కొనసాగించాలని నిర్ణయించారు. అక్కడ ఆమె ఫోటోలు కూడా తీయబోవడం లేదని స్పష్టం చేశారు. తమిళనాడు అంటే మొన్నటి వరకూ కక్ష పూరిత రాజకీయాలకు ప్రసిద్ధి. కానీ ఇప్పుడు అక్కడి రాజకీయాలంటే రాజకీయాలే అన్న వాతావరణం ఏర్పడుతోంది.