జాతీయ రాజకీయాలు విచిత్రంగా ఉంటున్నాయి. ముఖ్యంగా కేసీఆర్ కోణంలో ఈ రాజకీయాలు మరింత విచిత్రంగా మారుతున్నాయి. బీజేపీపై ఆయన ఎడతెరిపి లేని యుద్ధం చేస్తున్నట్లుగా చెబుతున్నారు. అలాగే ప్రకటిస్తున్నారు. చివరికి ఆయన పార్టీ పేరు కూడా మార్చేశారు. బీజేపీ పై పోరాడుతున్నా… తన సభలు.. సమావేశాలకు రావాలని బీజేపీ వ్యతిరేక పార్టీలను పిలిస్తే.. ఆయా పార్టీల ప్రతినిధులు వస్తున్నారు. కానీ వారు బీజేపీకి వ్యతిరేకంగా సభలు పెడితే మాత్రం పిలవడం లేదు. దీనికి తాజాగా స్టాలిన్ పుట్టిన రోజు వేడుకలే సాక్ష్యం
స్టాలిన్ పుట్టిన రోజు సందర్భంగా తమిళనాడులో అన్ని ప్రాంతీయ పార్టీల నేతలతో కలసి బహిరంగసభ నిర్వహించారు. ఈ సభకు కాంగ్రెస్ మిత్రపక్షాలు మాత్రమే కాదు అందరూ వచ్చారు. కాన తెలంగాణ సీఎం కేసీఆర్ రాలేదు. రాలేదు అనడం కన్నా స్టాలిన్ పిలువలేదు అని అనుకోవచ్చు. ఎందుకంటే ఆయనకు నిజంగానే ఆహ్వానం లేదు. కానీ కేసీఆర్ ఇటీవల తన సెక్రటేరియట్ ఓపెనింగ్ చేయాలనుకుని ఏర్పాటు చేసిన బహిరంగసభకు స్టాలిన్ ను పిలిచారు. ఆయన వచ్చేందుకు అంగీకరించారు. కానీ స్టాలిన్ మాత్రం కేసీఆర్ ను పిలువలేదు.
తేజస్వి యాదవ్, అఖిలేష్ యాదవ్, ఫరూక్ అబ్దుల్లా, మల్లికార్జున్ ఖర్గే సహా చాలా మంది నేతలు వచ్చారు. మామూలుగా కరుడు గట్టిన బీజేపీ వ్యతిరేకతతో ఉన్న పార్టీలు… కలిసి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. కానీ కేసీఆర్ మాత్రం… బీజేపీపై వ్యతిరేకతే కానీ.. కాంగ్రెస్ తో వేదికపై కనిపించలేరు. ఈ కారణంగా సమావేశాలకు హాజరు కాలేకపోతున్నారు. ఆయనను ఇబ్బంది పెట్టడం ఎందుకన్న ఉద్దేశంతో స్టాలిన్ లాంటి నేతలు పిలువడం లేదన్న అభిప్రాయం వినిపిస్తోంది. జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ ఇంకా అన్ని పార్టీలతో కలవలేకపోతున్నారని అనుకోవచ్చు. అయితే కేసీఆర్ బీజేపీకి ప్రత్యామ్నాయంగా బీఆర్ఎస్ ను నిలబెట్టగలనన్న ధైర్యంతో ఉన్నందునే ఇలాంటి సమావేశాలను పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ నేతలంటున్నారు.