ఉచిత పథకాల పేరుతో హడావుడి చేయడంలో తమిళ రాజకీయ పార్టీలు ఎప్పుడూ ముందు ఉంటాయి. సుదీర్ఘ పోరాటం తర్వాత సీఎం పీఠం దక్కించుకున్న స్టాలిన్ .. మరి తన మార్క్ చూపించకుండా ఉంటారా..?. స్టాలిన్ సీఎంగా ప్రమాణస్వీకారం చేయగానే ఐదు సంతకాలు చేశారు. అవన్నీ ప్రజల్ని ఆశ్చర్య చకితుల్ని చేసేవే. మేనిఫెస్టోలో లెక్కకు మిక్కిలిగా ఉచిత పథకాలు ప్రకటించిన స్టాలిన్.. వాటిని అమలు చేయడానికి ముందే ఐదు వరాలు ప్రకటించేశారు.
ముందుగా కరోనా కారణంగా ప్రజలందరి ఆర్థిక పరిస్థితి దెబ్బతినడంతో .. రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి రూ. నాలుగువేల ఆర్థిక సాయం చేయాలనుకున్నారు. అందులో భాగంగా తొలి విడత రెండు వేలు విడుదల చేస్తూ సంతకం చేశారు. ఆ తర్వాత వర్కింగ్ ఉమన్, విద్యార్థినిలకు ఉచిత బస్సు ప్రయాణాలు కల్పిస్తూ ఉత్తర్వులపై సంతకం చేశారు. అలాగే.. నిత్యావసర వస్తువులపై పెరిగిపోయిన ధరల కారణంగా ప్రజల్లో ఉన్న అసంతృప్తిని తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని అవిన్ బ్రాండ్ లీటర్ పాలపై రూ.3 తగ్గింంచారు. అలాగే ప్రజలు… తీవ్రంగా ఇబ్బంది పడుతున్న కరోనా చికిత్స విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు.
కరోనా చికిత్సను ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ ఉచితంగా అందివ్వాలని నిర్ణయించుకున్నారు. ఆస్పత్రులను ప్రభుత్వ పరిధిలోకి తీసుకుంటామని ప్రకటించారు. ఇవి కాకుండా.. పాలనను ప్రజల వద్దకే తీసుకొస్తానని ఎన్నికల సమంయలో చేసిన హామీకి అనుగుణంగా.. ప్రతి జిల్లాల్లోనూ గ్రీవెన్సెస్ విభాగాన్ని ప్రకటించారు. అక్కడ ఫిర్యాదులు తీసుకుని తక్షణం పరిష్కారం చూపేలా వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. మొత్తానికి స్టాలిన్ … తమిళ రాజకీయాల్లో ఇతర సీఎంల్లాగే.. తొలి రోజే.. తన ముద్రను చాటే ప్రయత్నం చేశారు.