ప్రాంతీయ పార్టీలన్నీ కూటమి కట్టాలనీ, జాతీయ పార్టీల ప్రమేయం లేకుండా ఢిల్లీ రాజకీయాల్లో కీలకం కావాలన్న ప్రతిపాదనతో డీఎంకే అధినేత స్టాలిన్ ని తెలంగాణ సీఎం కేసీఆర్ కలిసిన సంగతి తెలిసిందే. అయితే, ఫెడరల్ ఫ్రెంట్ ప్రతిపాదనను ఆయన సున్నితంగా తోసిపుచ్చారు. ఆ భేటీ అయిన తరువాత కేసీఆర్ గానీ, స్టాలిన్ గానీ మీడియాతో ఏమీ చెప్పలేదు. అయితే, ఇవాళ్ల చెన్నై విమానాశ్రయంలో స్టాలిన్ మాట్లాడుతూ… జాతీయ రాజకీయాల్లో మూడో ఫ్రెంట్ కి అవకాశాలు కనిపించడం లేదన్నారు. ఈనెల 23న ఫలితాల తరువాత అన్ని అంశాలపై స్పష్టత వస్తుందన్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చింది పొత్తులను ఏర్పరచుకోవడానికి కాదనీ, తమిళనాడులోని ఆలయాల సందర్శనకు మాత్రమే వచ్చారని స్టాలిన్ అన్నారు. ఆలయాల్లో పూజలు చేసుకోవడానికి వచ్చారనీ, పనిలోపనిగా మర్యాదపూర్వకంగా తనతో భేటీ అయ్యారే తప్ప, అంతకుమించి దీనికంటూ రాజకీయ ప్రాధాన్యత లేదని స్పష్టం చేశారు. సో… కేసీఆర్ మీటింగ్ పై స్టాలిన్ స్పందన ఇంత స్పష్టంగా ఉంది. ఇది రాజకీయ ప్రాధాన్యత ఉన్న భేటీ కాదనేశారు. కానీ, దేశ రాజకీయాల్లో మూడో ప్రత్యామ్నాయం ఏర్పాటు కావాలనీ, జాతీయ పార్టీలు లేని కేంద్ర ప్రభుత్వం వస్తేనే ప్రాంతీయ ప్రయోజనాలు నెరవేరుతాయని నిన్నటి భేటీలో స్టాలిన్ కి కేసీఆర్ వివరించినట్టు తెరాస వర్గాలు చెప్పాయి. అంతేకాదు, ఫెడరల్ ఫ్రెంట్ గురించి స్టాలిన్ కూడా సానుకూలంగా ఉన్నారంటూ కొన్ని మీడియా సంస్థలు కూడా రాసేశాయి. కానీ, స్టాలిన్ స్పందన ఇలా ఉంది. నిజానికి, కేసీఆర్, స్టాలిన్ భేటీ అయిన వెంటనే డీఎంకేకి చెందిన ఓ నేత జాతీయ మీడియాతో మాట్లాడుతూ… రాహుల్ గాంధీని తామే ప్రధాని అభ్యర్థిగా రెండుసార్లు ప్రతిపాదించామని స్టాలిన్ చెప్పారనీ, దానికి కేసీఆర్ నుంచి స్పందన లేదనీ అన్నారు.
ఇక, స్టాలిన్ తో భేటీపై తెరాస వర్గాల నుంచి సరైన స్పందన రావాల్సి ఉంది. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ చెన్నైలోనూ మీడియాతో మాట్లాడలేదు, ఇక్కడికి వచ్చాక కూడా ప్రస్థావించలేదు. ఏదేమైనా, ఒకటైతే స్పష్టం… ఎంత కాదనుకున్నా కేసీఆర్ చేస్తున్న ప్రయత్నం మోడీకి అనుకూలంగా మార్చే వ్యూహంగానే ఇతర రాష్ట్రాలకు చెందిన పార్టీలు చూస్తున్నాయి. కేసీఆర్ – మోడీల దోస్తీ గురించి ఈ సందర్భంలో మరింత చర్చ జరుగుతోంది. ముందుగా దీని తెరదించితేనే కేసీఆర్ చేస్తున్న ప్రయత్నం మూడో ప్రత్యామ్నాయ ఏర్పాటు కోసమే అనే భరోసా ఇతర పార్టీలకు కలిగే అవకాశం ఉంటుందని అనిపిస్తోంది.