ఇప్పటికి తెలంగాణలో ఉన్న నీటి పంచాయతీలే తేల్చుకోలేకపోతున్నారు.. ఇప్పుడు తమిళనాడుతోనూ కొత్తగా వివాదాలకు దిగాల్సిన పరిస్థితి వచ్చింది. ఏపీ-తమిళనాడు సరిహద్దుల్లో కుశస్థలి నదిపై ఏపీ నిర్మిస్తున్న రెండు ప్రాజెక్టుల్ని తక్షణం నిలిపివేయాలని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఏపీ సీఎం జగన్కు లేఖ రాశారు. కోశస్థలి నది పరివాహక ప్రాంతం రెండు రాష్ట్రాల్లో ఉంది. చెన్నై నగరానికి తాగు నీటి సరఫరా నిమిత్తం తమిళనాడు ప్రభుత్వం ఈ నదిపై పూండీ రిజర్వాయర్ను నిర్మించింది. దీనికి ఎగువన ఎలాంటి ఆనకట్టలు నిర్మించినా పూండీ జలాశయానికి నీటి కొరత ఏర్పడుతుంది.
ఆ ప్రభావం చెన్నై నగరంపై తీవ్రంగా ఉంటుందని అందుకే తమకు తెలియకుండా .. తమతో చర్చించకుండా ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని స్టాలిన్ జగన్ ను కోరారు. నిజానికి చాలా కీలకమైన ప్రాజెక్టుల్నే జగన్ సర్కార్ కట్టడం లేదు. చిన్న ప్రాజెక్టుల్నీ..అదీకూడా సరిహద్దుల్లో ఉన్న వాటిని ఎందుకు కడుతుందోనని చాలా మందికి సందేహం. నిజానికి అవి ప్రాజెక్టులు కాదు. టీడీపీ హయాంలోనే వాటికి నిధులు మంజూరయ్యారు. తమిళనాడు సరిహద్దులో నగరి వద్ద కుశస్థలి నదికి వరదలొస్తే నీరు వృథాగా సముద్రం పాలు కాకుండా ఒడిసిపట్టేందుకు గొలుసుకట్టు విధానంలో అనుసంధానమైన 20 చెరువులకు మళ్లించేలా ప్రాజెక్టుల్ని ఏపీ ప్రభుత్వం చేపట్టింది.
నిధులను కూడా గత ప్రభుత్వం మంజూరు చేసింది. కానీ గత మూడేళ్లనుంచి కాంట్రాక్టర్లు పనులు చేపట్టలేదు. అయితే ఇప్పుడు హఠాత్తుగా తమిళనాడు వ్యతిరేకంగా లేఖ రాయడం చర్చనీయాంశం అవుతోంది.ఏపీ – తమిళనాడు మధ్య ఇప్పటికే పాలార్ నదిపై ప్రాజెక్టుల వివాదంఉంది. పాలార్ నదిపై ఆంధ్రప్రదేశ్ నిర్మిస్తున్న కుప్పం ప్రాజెక్టుపై చాలా కాలంగా రెండు రాష్ట్రాల మధ్య వివాదం ఉంది.