ఉత్తరప్రదేశ్ లోని హధ్రాస్ లో బోలేబాబా సత్సంగ్ లో జరిగిన తొక్కిసలాటలో 120 మందికిపైగా చనిపోయారు. అంతా మహిళలు, చిన్నారులే. ఎందుకు చనిపోయారంటే.. బాబా పాదధూళిని అంటే.. ఆయన నడుచుకుంటూ పోయినప్పుడు అక్కడ ఉండే మట్టిని సేకరించడం కోసం పోటీ పడటం వల్ల తొక్కిసలాట జరిగింది. కాస్త తెలివి ఉన్న వారు ఎవరికయినా… వారి అమాయకత్వంపై జాలి వేస్తుంది. కానీ ప్రజల్ని పిచ్చి వాళ్లను చేయడంలో అందరూ పోటీ పడుతున్నారు. రాజకీయ పార్టీలు, మీడియా సహా అందరూ చేస్తున్న పాపాల వల్లే ఈ దుస్థితి వచ్చిందనేది బహిరంగ రహస్యం.
నిజాలు చెప్పే సాంకేతిక ఇంత పెరిగినా ఈ బాబాల పిచ్చేమిటి ?
సాంకేతిక ఎంతో పెరిగింది. నిజం ఏమిటో.. సైన్స్ ద్వారా ఇట్టే తెలిసిపోతుంది. కానీ ప్రజల్లో .. సామాన్యుల్లో బాబాల పిచ్చి మాత్రం తగ్గడం లేదు. ఎవరో ఓ వ్యక్తి తనను తాను దైవాంశ సంభూతుడిగా చెప్పుకుంటే చాలు .. కాళ్ల మీదపడిపోతారు, తమ సమస్యలను తమ ప్రమేయం లేకుండా ఆయన పరిష్కరించేస్తారని నమ్ముతారు. ఇలా నమ్మడానికి చదువుతో పని లేదు. ఎంత చదువుకున్నా ఆ మూర్ఖత్వం మాత్రం పోవడం లేదు. ఇక చదువులేని వాళ్ల సంగతి చెప్పాల్సిన పని లేదు. ఘోరం జరిగిన సత్సంగ్‌లో బోలేబాబా కార్యక్రమాన్ని రెండున్నర లక్షల మంది హాజరయ్యారంటే.. వాళ్ల మీద ప్రభావం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
చదువు కూడా తెలివి ఇవ్వలేకపోతున్న సమాజంలో ఉన్నాం !
చదవేస్తే ఉన్నమతి పోయిందనే సామెత ఉంది. ఇప్పుడు అదే నిజం అవుతోంది. రాకెట్ సైన్స్ చదివిన వారు కూడా మూఢ నమ్మకాలతో మునిగిపోతున్నారు. బాబాల పేరుతో వచ్చే వారి ట్రాప్ లో పడిపోతున్నారు. సమస్య ఒక్క బోలేబాబాతో అయితే నిర్మూలించవచ్చు కానీ.. మనకు అడుగడుగునా ఈ బోలెబాబాలు కనిపిస్తున్నారు. వీధికొక బాబా ఉంటారు. కాలనీకొకరు ఉంటారు… రాష్ట్ర స్థాయిలో పొలిటికల్ బాబాలు ఉంటారు. వీరెవరికి సామాన్యులకు ఉండేంత నాలెడ్జ్ కూడా ఉండదు. కానీ మోసం చేయడం మాత్రం వచ్చు. అదే చేస్తున్నారని తెలిసినా ప్రజలు ఆ మాయలో పడిపోతూంటారు.
రాజకీయ పార్టీలు, నేతలదే అసలు పాపం – అన్ని మతాల్లోనూ ఇదే జాడ్యం !
కులం, మతం , దేవుళ్ల పేరుతో రాజకీయాలు చేసే నేతలతే అసలు తప్పు. దేశానికి ఈ దౌర్భాగ్యం పట్టడానికి వారే కారణం. దేవుడి పేరుతో.. ఎప్పటికప్పుడు రాజకీయాలు చేయడం… ప్రజల్ని భావోద్వేగాలకు గురి చేసి.. ఓట్లు పొందేందుకు వాళ్లను మూర్ఖుల్ని చేస్తున్నారు. అన్ని మతాల్లోనూ ఇది ఉంది. క్రి్స్టియన్లు… ముస్లింలలోనూ ఇలాంటి మత మౌఢ్యులు ప్రజల్ని నమ్మేవారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.
150 ఏళ్ల కిందటి చైతన్యం ఇప్పుడేమయింది ?
మహరాజ్ అనే ఓ సినిమా ఇటీవల ఓటీటీల్లో వచ్చింది. ఆ సినిమాలో ఇలాంటి బాబా ఒకరు.. తానే దేవుడ్ని అని ప్రచారం చేసుకుని చరణ సేవ పేరుతో భక్తురాళ్లను అందరి ముందు అనుభవించేస్తూంటాడు. అది చేసేందుకు టిక్కెట్లు కూడా పెడతాడు. ఇదేంటంటే..కోర్టులో కూడా అది దైవసేవ అంటాడు. కానీ ప్రజలు తిరగబడతారు. అది నిజంగా జరిగిన ఘటనల్నే సినిమాగా తీశారు. అప్పట్లో కనిపించిన చైతన్యం.. 150 ఏళ్ల తర్వాత.. చదువు .. విజ్ఞానం అన్నీ పెరిగిన తర్వాత ఇప్పుడు మచ్చుకైనా కనిపించడం లేదు. ప్రాణాలు ఇలా పాదధూళి తీసుకుంటూంటే.. ఇంకా నాగరికత, చైతన్యం అనేది అంతమయిందని అనుకోక తప్పదు.