ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలకు పెద్ద చిక్కొచ్చి పడింది. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ఇప్పుడు ప్రజలకు ఏం చెప్పాలో వారికి అర్థం కావడం లేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రజల సెంటిమెంట్ అంశమని.. ప్రైవేటీకరణకానివ్వబోమని చెబుతూ వస్తున్నారు. అందు కోసం ఢిల్లీ వెళ్లి మూడు రోజుల పాటు అగ్రనేతలతో సమావేశమై వచ్చారు. వచ్చిన తర్వాత ఇంకా నిర్ణయం తీసుకోలేదని.. టీడీపీ, వైసీపీ మాత్రమే ప్రైవేటీకరణ ప్రచారం చేస్తున్నాయని వాదించడం ప్రారంభించారు. అయితే వారి వాదన ప్రజల్లోకి వెళ్లక ముందే స్టీల్ ప్లాంట్ అమ్మకానికి కమిటీ వేసేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ సైతం.. అమ్మకాలపై వెనక్కి తగ్గేది లేదని తేల్చేశారు. ఇప్పుడు అందరూ బీజేపీ నేతల వైపు చూస్తున్నారు.
ఏం చెబుతారా అని ఎదురు చూస్తున్నారు. కానీ ఇప్పుడు బీజేపీ నేతలు ఆ అంశంపై మాట్లాడటానికిపెద్దగా ఇష్టపడటం లేదు. ఏం చెప్పాలో తెలియక సతమతమవుతున్నారు. గంటా శ్రీనివాసరావు బీజేపీ నేతల్ని టీజ్ చేస్తూ ట్వీట్లు చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ విషయంలో తాము ఎలాంటి ప్రకటనలు చేయాలో చెప్పాలని రాష్ట్ర బీజేపీ నేతలు.. కేంద్ర పెద్దల వైపు చూస్తున్నారు. కానీ వారు పార్టీ వేరు.. ప్రభుత్వం వేరు అన్నట్లుగా ఉండమని సంకేతాలు పంపుతున్నారు. పార్టీ పరంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకించమనే చెబుతున్నారు. కానీ ప్రభుత్వం పరంగా చేయాల్సినవి చేస్తున్నారు.
ప్రజల ముందు మాత్రం… బీజేపీ నేతలు బకరాలు అవుతున్నారు. ఇప్పుడు ఏపీ బీజేపీ నేతలు తెగించి.. స్టీల్ ప్లాంట్ అమ్మేస్తే తప్పేంటి అనేవాదన వినిపించినా ఆశ్చర్యం లేదనే చర్చ నడుస్తోంది. అంతకు మించి దారి వారికి లేదు. ఇంకా ప్రైవేటీకరణ జరగదని వాదిస్తే.. ప్రజలను మభ్య పెడుతున్నారన్న విమర్శలు వస్తాయని వారికీ తెలుసంటున్నారు.