Stand Up Rahul Review
తెలుగు360 రేటింగ్ 2/5
కొత్త సీసా కొన్నంత మాత్రన చాలదు, అందులో సరుకు కూడా కొత్తగా ఉండాలి. అప్పుడే ప్రయోజనం. ఆ చిన్న లాజిక్‌ని మరిచిపోతున్నారు నవతరం దర్శకులు. ఓ కొత్త కాన్సెప్టో లేదంటే, ఓ కొత్త పాత్రో ఐడియా వచ్చిందంటే దాని చుట్టూ కథని అల్లడం మొదలు పెడుతుంటారు. అసలు ఆలోచించాల్సింది కొత్త కథల గురించే అనేది వాళ్లకి తత్వం బోధపడ్డాక గానీ అర్థం కాదు. కూర్చుంది చాలు… అనే క్యాప్షన్‌తో `స్టాండప్ రాహుల్`ని తీశాడు కొత్త దర్శకుడు శాంటో. కానీ ఈ రాహుల్ గ్రాఫ్ సినిమా ఆరంభం నుంచి చివరి వరకు ఎంతకీ లెగదు. అలా కూర్చుండిపోతుంది. అసలు కథలోకి వెళితే…
రాహుల్ (రాజ్‌తరుణ్)కి చుట్టూ ఉన్నవాళ్లని నవ్వించడం ఇష్టం. ఇంట్లో జరిగే శుభ కార్యాల్లోనూ తింగరి పనులు చేస్తూ అందరినీ నవ్వించే ప్రయత్నం చేస్తుంటాడు. స్టాండప్ కామెడీ అంటే పిచ్చి. కానీ ఆ కామెడీ జోలికి వెళ్లకుండా తిన్నగా ఉద్యోగం చేసుకోమని తల్లి ఇందు (ఇంద్రజ) హైదరాబాద్‌కి పంపుతుంది. అక్కడికి వెళ్లాక కూడా తన అలవాటుని మానుకోడు. ఇంతలో తను పనిచేసే చోట శ్రేయరావు (వర్ష బొల్లమ్మ)తో పరిచయం ఏర్పడుతుంది. శ్రేయ తనకి చిన్నప్పట్నుంచే తెలిసిన అమ్మాయి. ఆ తర్వాత ఇద్దరూ ప్రేమలో పడతారు. కానీ రాహుల్‌కి ప్రేమంటే ఇష్టం ఉన్నా, పెళ్లిపై మాత్రం నమ్మకం లేదు. కారణం… పెళ్లి తర్వాత విడిపోయిన తన తల్లిదండ్రుల జీవితమే. ఇంతకీ రాహుల్ తల్లిదండ్రుల సమస్య ఏమిటి? అది అతనిపై ఎలాంటి ప్రభావం చూపించింది? రాహుల్, శ్రేయ ప్రేమకథ సుఖాంతమైందా లేక విడిపోయారా? అనే విషయాల్ని తెరపై చూడాల్సిందే.
కథగా చూస్తే ఏ భాషలోకి వెళ్లినా ఈ లైన్‌తో రూపుదిద్దుకున్న బోలెడన్ని సినిమాలు గుర్తుకొస్తాయి. మరి దీన్ని కొత్త కాన్సెప్ట్ అని ఎలా అనుకుంటారనే సందేహం రాకపోదు. స్టాండప్ కామెడీ నేపథ్యంలో నడిపించడమనే అంశమే హీరోని, నిర్మాతల్ని ముందుకు నడిపించి ఉంటుంది. నిజానికి ప్రేక్షకుల్ని మెప్పించడానికి ఈ మాత్రం నేపథ్యం, కథలైనా సరిపోతాయి. కాకపోతే తూకం చెడకుండా పాత్రల్ని మలచాలి, డోస్ తగ్గకుండా ఎమోషన్స్‌ని రంగరించాలి. స్టాండప్ నేపథ్యాన్ని ఎంచుకున్నందుకైనా అందుకు తగ్గట్టుగా కామెడీని పండించాలి. కానీ ఇవేవీ వర్కౌట్ కాలేదు ఈ సినిమాలో. అందుకే కొత్తసీసాలో పాత సారా చందంగా మారింది సినిమా. రాహుల్ ప్రపంచాన్ని పరిచయం చేస్తూ కథని మొదలు పెట్టాడు దర్శకుడు. అతని తల్లిదండ్రుల పాత్రల నేపథ్యం ఆసక్తిని రేకెత్తిస్తుంది. హీరో హీరోయిన్లు కలిశాక అసలు కథ మొదలవుతుంది. బాత్రూమ్లో ఆ ఇద్దరి మధ్య సాగే కంగాళీ నవ్వించకపోగా విసుగు పుట్టిస్తుంది. ఆ తర్వాత ఆపీస్ నేపథ్యం, ఇద్దరి మధ్య ప్రేమ చిగురించడం… ఇలా ఎలాంటి మలుపులు లేకుండా ఫ్లాట్‌గానే సాగుతుంది సినిమా. మధ్య మధ్యలో స్టాండప్ కామెడీ అంటూ హీరో లెక్చర్లు దంచుతుంటాడు. ఓ సన్నివేశంలో ఆవేశంతో అమ్మాయిల గురించి చెప్పే సుదీర్ఘమైన సన్నివేశం ఎందుకో కూడా అర్థం కాదు. అలాగే స్టాండప్ కామెడీ పేరుతో ద్వంద్వార్థాలతో కూడిన సంభాషణలు కూడా బోలెడన్ని వచ్చి వెళుతుంటాయి. విరామ సమయానికి ముందు వచ్చే సన్నివేశాలే కాస్త ఆసక్తిని రేకెత్తిస్తాయి. ఇద్దరి ఆలోచనలు వేర్వేరు అనే విషయం తెలిసి ప్రేమకి అంగీకారం తెలపకుండా కథానాయకుడు సంఘర్షణ పడటం… ఆ తర్వాత హీరోయిన్ ఓ నిర్ణయానికొచ్చి హీరోతో చెప్పడం ఆకట్టుకుంటుంది. ద్వితీయార్థం మళ్లీ మామూలే. కాకపోతే ఈసారి స్టాండప్ కామెడీ కొన్ని చోట్ల వర్కౌట్ అయ్యింది.
నిజానికి స్టాండప్ కామెడీ నేపథ్యాన్ని బాగా వాడుకోవచ్చు. తగిన మోతాదులో కామెడీ పండినా ఈ సినిమా మరో స్థాయికి వెళ్లేది. కానీ ఆ విషయంలో సరైన వర్క్ జరగలేదు. కొత్తతరం దర్శకుల ఆలోచనలు కొత్తగా ఉంటాయనడంలో సందేహం లేదు. కానీ అంతే బలంగా అనుకున్న భావోద్వేగాల్ని తెరపైకి తీసుకు రాగలగాలి. నవతరం దర్శకులు ఆ విషయంలోనే ఫెయిల్ అవుతున్నారు. ఈ సినిమా మరో ఉదాహరణ. యువతరం నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ తమని తాము చూసుకునేంతగా ఇందులో పాత్రలు కనిపిస్తాయి. కానీ వాటిలో ఎక్కడా లీనం కాలేరు.
రాజ్‌తరుణ్ ఇందులో యంగ్‌గా కనిపించాడు. ట్రెండీ కథకి తగ్గట్టుగా అతను కూడా మేకోవర్ అయ్యాడు. కొన్ని చోట్ల ఎమోషన్స్ కూడా బాగా పండించాడు. వర్ష బొల్లమ్మ పాత్ర, ఆమె నటన చిత్రానికి ప్రధానంగా హైలెట్ అయ్యింది. ఎమోషన్స్ పండించడంలో తన ప్రతిభ చాటింది. వెన్నెల కిశోర్ పాత్ర వర్కౌట్ కాలేదు. హీరోకి బాస్‌గా కనిపించే ఆయనకి అలాంటి పాత్రలు కొట్టిన పిండి. కానీ ఆ పాత్రని డిజైన్ చేసిన తీరు, సంభాషణలు కుదరలేదు. ఇంద్రజ, మురళీశర్మ పాత్రల పరిధి తక్కువే అయినా ప్రభావం చూపించారు. సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. శ్రీరాజ్ సినిమాటోగ్రఫీ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. స్వీకర్ అగస్త్య పాటలతోపాటు, నేపథ్య సంగీతం బాగుంది. నందకుమార్ డైలాగ్స్ బాగున్నాయి. దర్శకుడు శాంటో కొత్త నేపథ్యాన్ని తెరపై ఆవిష్కరించినా ఎమోషన్స్ పండించడంలో తడబాటు పడ్డారు. నిర్మాణం పరంగా సినిమా స్థాయికి తగ్గట్టుగా జాగ్రత్తలు తీసుకున్నారు నిర్మాతలు.
కథానాయకుడు రాజ్‌తరుణ్‌కి హిట్టు అవసరం చాలా ఉంది. ఆయన ఆ మాట వినడానికి చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారు. ఆ ఎదురు చూపుల్ని మరికొంతకాలం కొనసాగించాల్సిందే అని చెప్పే చిత్రమిది. స్టాండప్ కామెడీ నేపథ్యం తప్ప ప్రేక్షకులకు కొత్తగా ఎలాంటి అనుభూతిని పంచని సినిమా ఇది.
ఫినిషింగ్ టచ్: రాహుల్… కూర్చున్నాడు
తెలుగు360 రేటింగ్ 2/5