వెంకటేష్ – తేజ కాంబినేషన్లో ఓ సినిమా పట్టాలెక్కబోతోంది. ఇప్పటికే ఈ సినిమా మొదలవ్వాల్సింది. కానీ కథానాయిక దొరక్క.. షూటింగ్ ఆలస్యమైంది. మార్చి తొలి వారంలో చిత్రీకరణ మొదలెట్టనున్నారు. ఈలోగా కథానాయికని ఫైనలైజ్ చేసే పనిలో పడింది చిత్రబృందం. ఎంతమందిని సంప్రదించినా.. ఏదో ఓ సమస్య. కాల్షీట్లు సర్దుబాటు చేయలేకపోవడంతో కథానాయిక ఎవ్వరూ సెట్ అవ్వడం లేదు. ప్రస్తుతం శ్రియ, కాజల్, అనుష్కల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఈ ముగ్గురిలో శ్రియకే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. కాకపోతే.. తేజకు ఓ భయం పట్టుకుంది. వెంకీ – శ్రీయ జంటగా తెరకెక్కిన `సుభాష్ చంద్రబోస్` అట్టర్ ఫ్లాప్ అయ్యింది. అందుకే శ్రియ విషయంలో తేజ ఆలోచనలో పడ్డాడని సమాచారం. కాజల్ తనకు అచ్చొచ్చిన కథానాయిక. అయితే తన డేట్లు ప్రస్తుతానికి సర్దుబాటు కావడం లేదు. దాంతో వెంకీ సమస్య ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు తయారైంది. తేజ అన్వేషణ ఎప్పటికి ఫలిస్తుందో.