తమిళనాడు ప్రజల సమస్య అయిన జల్లికట్టు వివాదంపైన మన తెలుగు స్టార్ హీరోలు స్పందించారు. చాలా స్పష్టంగా వాళ్ళ అభిప్రాయం వ్యక్తం చేశారు. వాళ్ళ అభిప్రాయం తప్పా? ఒప్పా? అన్న విషయం తర్వాత. కానీ సమాజంలో మేమూ భాగమే అని నిరూపించుకున్నారు. అద్దాల మేడల్లో, ఎసి ప్రపంచంలో ఉన్నా కూడా మాకూ అన్ని విషయాలూ తెలుస్తూ ఉంటాయి. సమాజంలో జరుగుతున్న పరిణామాలపైన మాకూ అవగాహన ఉంది. స్పష్టమైన అభిప్రాయాలు ఉన్నాయి అని నిరూపించుకున్నారు. అందుకోసమైన పవన్, మహేష్‌లతో పాటు మిగతా తెలుగు హీరోలను, తమిళ్ స్టార్ హీరోలను కూడా అభినందించాల్సిందే.
మరి ఇదే స్టార్ హీరోలు తెలంగాణా ఉద్యమం గురించి ఎందుకు స్పందించలేదు? ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అంశం గురించి ఎందుకు అభిప్రాయాలు వ్యక్తం చేయలేదు? తెలుగునాట ఉద్యమాలు, ఆందోళనలు జరుగుతూ తెలుగు ప్రజలందరూ కూడా ఆందోళనలో ఉన్నప్పుడు స్పందించాలన్న కనీస జ్ఝానం ఎందుకు లేకుండా పోయింది? ఈ స్టార్ హీరోలకు ఉండే వీరాభిమానులు, భక్తులు కూడా నానా కష్టాలూ పడుతూ, అయోమయంలో, ఆందోళనలో ఉన్నప్పుడు ఎందుకు స్పందించలేదు? పవన్ కళ్యాణ్ కూడా తెలంగాణా రాష్ట్రంపై స్పష్టమైన నిర్ణయం వచ్చాకనే తన ఫాం హౌస్ నుంచి బయటకు వచ్చాడేం?
జల్లికట్టు గురించి తెలుగు స్టార్ హీరోలు స్పందిస్తున్నారు. మరి తమిళ్ స్టార్ హీరోలు రజినీకాంత్, కమల్ హాసన్‌లాంటి వాళ్ళకు తెలుగు వాళ్ళ సమస్యలు ఎందుకు పట్టవు? రాజకీయ నాయకులకు, సినిమా హీరోలకు తేడా ఉండాలి కదా? అందరూ రాజకీయమే చేస్తామంటే ఎలా? వ్యాపార ప్రయోజనాలు తప్ప మరే విషయాలు మాకు పట్టవు అనే ధోరణి భావ్యమా? పొద్దున్న లేస్తే అభిమానులే మా ప్రాణం అని కోటి రూపాయల హీరో నుంచి యాభై కోట్లు తీసుకునే హీరో వరకూ అందరూ ఒకటే డైలాగులు పేల్చుతూ ఉంటారు. తమిళ్ స్టార్స్ అయితే వాళ్ళ సినిమా రిలీజ్‌కి రెడీ అయినప్పుడల్లా ‘తెలుగు వాళ్ళు సూపర్, తెలుగువాళ్ళు బంపర్…’ అంటూ వాళ్ళ యాక్టింగ్ టాలెంట్ మొత్తం చూపిస్తూ మాటలు చెప్తూ ఉంటారు.
ఇప్పుడు జల్లికట్టు విషయంలో కూడా మొత్తం తమిళనాడులో ఉన్న సినీ ప్రేక్షకులందరూ కూడా ఒక స్టాండ్ తీసుకుని ఉన్నారు కాబట్టి ఈ స్టార్ హీరోలు కూడా అదే స్టాండ్ తీసుకొని మాట్లాడడానికి రెడీ అయిపోయారు. అదే తెలంగాణా ఇష్యూ లాగే ఏం మాట్లాడితే…ఎవరికి దూరమవుతామో అని పరిస్థితి ఉంటే అసలు మాట్లాడేవాళ్ళా? సినిమాల బడ్టెట్స్ పెరిగిపోతున్నాయి కాబట్టి మార్కెట్‌ని విస్తరించుకోవాలి, ఎక్కువ మంది ప్రేక్షకులు వాళ్ళ సినిమాలు చూసేలా చేసుకోవాలి అని ఆలోచించడంలో తప్పులేదు. అందుకోసం గొప్ప కథలు, గొప్ప సినిమాలు చేయాలి. అంతేకానీ సమాజంలో జరుగుతున్న సంఘటనలను ఉపయోగించుకుని మార్కెట్ విస్తరించుకోవాలన్న కక్కుర్తి మాత్రం క్షమార్హం కాదు. అది సమాజానికి కూడా మంచిది కాదు. అంతకంటే కూడా వాళ్ళ దగ్గరున్న కోట్లాది రూపాయల్లో కొంత ఖర్చుపెట్టి ఏవైనా మంచి పనులు చేస్తే మంచి పేరు తెచ్చుకుంటే ఎవ్వరికీ అభ్యంతరం ఉండదు. అంతేకానీ రాజీకయ తెలివితేటలన్నీ ప్రదర్శిస్తూ ఈ ఇష్యూ పైన మనం మాట్లాడితే మనకు మైలేజ్ వస్తుంది అని ఆలోచించి స్పందించడం మాత్రం కరెక్ట్ కాదు. అంత చిత్తశుద్ధి, నిజాయితీ ఉన్నవాళ్ళయితే కొంత నష్టం జరుగుతుందని తెలిసినా కూడా అభిప్రాయం వ్యక్తం చేయగలగాలి.
రాష్ట్ర విభజన ఉద్యమం ఉదృతంగా జరుగుతున్న కాలంలోనే….సినిమాలో ఆ పాటకు తగ్గ సందర్భం లేకపోయినప్పటికీ….‘తెలుగు జాతి మనది….నిండుగ వెలుగు జాతి మనది……..’ అంటూ పాట రూపంలో తెలుగువాళ్ళందరికీ కూడా సమైక్యంగా ఉండాలన్న సందేశాన్ని ఇచ్చిన ఎన్టీఆర్‌కి ఉన్న గట్స్ వీళ్ళలో ఎవరికైనా ఉన్నాయా?