రైతు భరోసాకు ప్రభుత్వం నిధులు విడుదల చేయడంతో కేసీఆర్ తనదైన రాజకీయం ప్రదర్శిస్తున్నారు. ఎన్నికల వేళ పెట్టుబడి కింద రైతుల అకౌంట్లో డబ్బులు జమ అవుతుండటంతో ఆ క్రెడిట్ బీఆర్ఎస్ ఖాతాలో వేస్తున్నారు. రైతు భరోసా నిధుల విడుదల తమ పోరాట ఫలమేనని బీఆర్ఎస్ వాదిస్తోంది. రైతు సమస్యలపై కేసీఆర్ కన్నెర్ర చేయడంతోనే కాంగ్రెస్ యాసంగి సీజన్ రైతు భరోసా నిధులను విడుదల చేసిందని ఓటర్లకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు.
బీఆర్ఎస్ కు మొదటి నుంచి అండగా నిలిచింది ప్రధానంగా రైతులే. లోక్ సభ ఎన్నికల్లో వారిపై బీఆర్ఎస్ భారీ ఆశలు పెట్టుకుంది. తెలంగాణలో కరువు పరిస్థితులు నెలకొన్నాయని, రైతులను ఆదుకునే దిక్కు లేదని ప్రభుత్వాన్ని కేసీఆర్ ఎండగడుతున్నారు. ఈ క్రమంలోనే రైతు భరోసా నిధులను సర్కార్ విడుదల చేయడంతో బీఆర్ఎస్ దీనిని తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తోంది.
బస్సు యాత్రలో రైతు సమస్యలను ప్రధాన ఎజెండాగా చర్చకు నిలుపుతుండటంతోనే రైతు భరోసాను ప్రభుత్వం స్టార్ట్ చేసిందని కేసీఆర్ చెప్తున్నారు. ఎన్నికలు దగ్గరపడుతోన్న వేళ కాంగ్రెస్ , బీజేపీలను తనదైన శైలిలో ఎదుర్కొంటూ ప్రతీ అంశాన్ని బీఆర్ఎస్ కు అనుకూలంగా మార్చే వ్యూహాన్ని కేసీఆర్ అమలు చేస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి.
కేసీఆర్ వ్యాఖ్యలను జనం విశ్వసిస్తారో లేదో ఎన్నికల తర్వాత తేలనుంది.