గడచిన కొన్నాళ్లు చూసుకుంటే… గడచిన నాలుగేళ్లలో ఎన్నడూ లేని విధంగా వివిధ రాజ్యాంగబద్ధ వ్యవస్థలన్నీ వివాదాల్లోకి వస్తోన్నాయి. సీబీఐ వివాదం రోజుకో మలుపు తిరుగుతున్న వైనం చూస్తున్నాం. ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీద కూడా కేంద్ర ప్రభుత్వం గుర్రుగా ఉన్న పరిస్థితి వచ్చింది! తాజాగా కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ మాట్లాడుతూ ఆర్బీఐ తీరును తప్పుబట్టారు. 2008 నుంచి 2014 మధ్య కాలంలో అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం తరువాత బ్యాంకులు విచక్షణ లేకుండా అప్పులు ఇచ్చేస్తుంటే ఆర్బీఐ చూస్తూ కూర్చుందని ఆయన వ్యాఖ్యానించారు. ఆర్థిక వ్యవస్థను కృత్రిమంగా నడపడం కోసం ఇష్టమొచ్చినట్టు రుణాలు ఇచ్చేయండి అంటూ బ్యాంకులకు ఆర్బీఐ చెప్పిందన్నారు.
వాస్తవానికి ఆర్బీఐ స్వతంత్రంగా వ్యవహరిస్తుంది. కానీ, దానిపై కూడా కేంద్ర ప్రభుత్వం ఆధిపత్య ధోరణితో వ్యవహరిస్తుండటం గమనార్హం. ఈ సందర్భంలోనే అరుణ్ జైట్లీ మరో కీలక వ్యాఖ్య కూడా చూశారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్ను ప్రభుత్వమే సుప్రీం అన్నారు. కరెక్టే.. కానీ, ఈ వ్యాఖ్య ద్వారా ఆయన చెప్పాలనుకుంటున్నది ఏంటంటే… అన్ని సంస్థలపైనా కేంద్ర అజమాయిషీ ఉంటుందనీ, తాము చెప్పినట్టుగా వ్యవహరించాలనేదే కదా జైట్లీ ఉద్దేశం. అయితే, ఈ క్రమంలో ఆయా వ్యవస్థలకు కేంద్రం ఇస్తున్న గౌరవం ఏపాటిది అనేది కూడా ప్రజలకు గుర్తొస్తుంది కదా!
ఆర్బీఐ మీద జైట్లీ చేసిన వ్యాఖ్యల వెనక మరో వ్యూహం కూడా స్పష్టంగానే కనిపిస్తోంది. ఎన్.పి.ఎ.లు ఎక్కువైపోయాయనీ, నీరవ్ మోడీ, విజయ్ మాల్యా లాంటి ఆర్థిక నేరగాళ్లు వేల కోట్ల రూపాయలు బ్యాంకులకు టోకరా వేసి దేశాన్ని విడిచి వెళ్లిపోయినా మోడీ సర్కారు ఏమీ చెయ్యలేకపోయిందనే తీవ్ర విమర్శ ఉంది. అయితే, వీటన్నింటికీ మూల కారణం ఆర్బీఐ తీరులోనే ఉందని చూపించే ప్రయత్నాన్ని జైట్లీ చేస్తున్నట్టుగా అనిపిస్తోంది. ఈ తరహా ధోరణులను ఆర్బీఐ నియంత్రించ లేకపోయిందనే వాదనను తెరమీదికి తీసుకొచ్చే ప్రయత్నంగా ఇది కనిపిస్తోంది. అంటే, మోడీ సర్కారు వైఫల్యాల్లో తీవ్రమైన ఈ ఆర్థిక నేరాల అంశాన్ని తమ ఫెయిల్యూర్ కాదని చెప్పేందుకు కేంద్రం వెతుక్కుంటున్న సాకుగా దీన్ని చూడొచ్చు! ఓవరాల్ గా.. వివిధ వ్యవస్థలపై తాజాగా వివాదాలు రేగుతున్న తీరు గమనిస్తుంటే… తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే అన్నింటినీ కేంద్రమే లాక్కొస్తోందన్నట్టుగా కనిపిస్తోంది.