జనసేన పార్టీకి గాజు గ్లాస్ గుర్తును రాష్ట్ర ఎన్నికల సంఘం రిజర్వ్ చేసింది. రాష్ట్ర పార్టీగా గుర్తించి ఈ మేరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీ పోటీ చేసే అభ్యర్థులందరికీ ఈ గుర్తు కేటాయిస్తారు. రాష్ట్ర ఎన్నికల సంఘం గుర్తిస్తే.. కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించకుండా ఉండదు. వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థులు ఎక్కడ పోటీ చేసినా గుర్తుగా గాజు గ్లాసే లభిస్తుంది.
అయితే జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయి పార్టీగా గుర్తింపు పొందేంత ఓట్లు, సీట్లు రాని కారణంగా జనసేనకు గాజు గ్లాస్ గుర్తును ఫ్రీ సింబల్స్ కేటగరిలో గతంలో కేంద్ర ఎన్నికల సంఘం చేర్చింది. అయితే ఇది నిబంధనల ప్రకారమే అలా చేశారని.. ఆ గుర్తు వేరే పార్టీలకు ఇచ్చే అవకాశం లేదని అందరికీ తెలుసు. జనసేన రిక్వెస్ట్ పెట్టుకుంటే తమ పార్టీ అభ్యర్థులందరికీ అదే గుర్తు కావాలని అడిగితే కేటాయిస్తారు. ఇదంతా అందరికీ తెలిసిన విషయమే . అయినా జనసేన పార్టీని కించ పర్చడానికి.. పవన్ ను ఎగతాళి చేయడానికి పార్టీ గుర్తు గురించి మాట్లాడుతూ ఉంటారు.
ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల సంఘం గాజు గ్లాస్ గుర్తును రిజర్వ్ చేయడంతో… గుర్తుపై క్లారిటీ వచ్చింది. నిజానికి రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రభుత్వ కనుసన్నల్లో నడుస్తుంది. అయినా గుర్తు విషయంలో ఇబ్బంది పెట్టలేకపోయారు. మరి కేంద్ర ఎన్నికల సంఘం మాత్రం ఎందుకు పెడుతుంది. పవన్ ను గుర్తు విషయంలో విమర్శించామని అనుకోవడం తప్ప.. వైసీపీ నేతలకు మిగిలిందేమీ లేదు.