తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, తెరాస అధికారంలోకి వచ్చి రెండేళ్లయిన సందర్భంగా సంబురాలు మోత మోగాయి. ప్రధాన రోడ్లన్నీ కలర్ ఫుల్ గా మారాయి. ప్రభుత్వ భవనాలు రంగుల హంగులు సింగారించుకున్నాయి. జంట నగరాల్లో హోర్డింగులు కొత్త కళను అద్దాయి. ఆర్టీసీ బస్సులు కొత్త పెళ్లికూతురిలా ముస్తాబయ్యాయి.
గన్ పార్కులో అమరవీరులకు నివాళి, లుంబిని పార్కులో శంకుస్థాపనతో సంబురాల పర్వాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. సంజీవయ్య పార్కులో భారీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో అసలైన వేడుకలు ఆయన సమక్షంలో ఘనంగా జరిగాయి. ఫీల్ గుడ్. అంతా బాగుంది.
దశాబ్దాల కల అయిన రాష్ట్ర సాధన పెద్ద విషయమే. సంబురాలు జరుపుకోవాల్సిందే. అయితే, సంబురాల మోజులో పడి ప్రజల వాణిని వినిపించుకోక పోతేనే అసలు సమస్య. చేసిన పని గురించి ఎంత గొప్పగా చెప్తారో, చెయ్యని పని అసలు వైఫల్యమే కాదని అంతే గట్టిగా దబాయించి చెప్పడం బహుశా కేసీఆర్ ఒక్కరికే సాధ్యం. రెండేళ్లలో కేవలం ఒకేఒక్క చోట డబుల్ బెడ్ రూం ఇళ్ల కాంప్లెక్స్ నిర్మాణం జరిగింది. దాన్ని చూపించి, అదే ట్రంప్ కార్డుగా ఉపయోగించి హైదరాబాద్, వరంగల్, ఖమ్మం ఎన్నికల్లో విజయం సాధించారు. ఆ తర్వాత కూడా ఒక్క ఇల్లయినా కట్టింది లేదు.
గ్రేటర్ హైదరాబాదును విశ్వ నగరం చేయడానికి మంత్రి కేటీఆర్ 100 రోజుల యాక్షన్ ప్లాన్ ప్రకటించారు. వాటిలో ఎన్ని పనులు జరిగాయనేది ఆయన స్వయంగా సమీక్షించి చెప్పాలి. అమెరికా పర్యటన నుంచి రాగానే ఆ పని చేస్తారేమో. అయితే, సదరు యాక్షన్ ప్లాన్ లో ఆయన ఘనంగా ప్రకటించిన ప్రణాళిక నామ్ కే వాస్తేగానే అమలయిందని నగర పౌరులకు స్పష్టంగా అర్థమవుతోంది. నగరంలో చాలాచోట్ల తవ్వకాలే తప్ప, రోడ్లు ఆనవాళ్లు లేకుండా పోయాయి. పల్లెటూళ్లలో కూడా సిమెంట్ రోడ్లు కనిపించే ఈ రోజుల్లో హైదరాబాదులో అనేక చోట్ల మట్టి రోడ్లు, అదీ ఎగుడుదిగుడు బాటలు నరకం చూపిస్తున్నాయి. విశ్వనగరం ఇలాగే ఉంటుందేమో కేటీఆరే చెప్పాలి.
రైతు ఆత్మహత్యలు తరచూ జరిగే రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. సంపన్న రాష్ట్రమని గొప్పలు చెప్పుకోవడమే గానీ, ప్రయివేటు వడ్డీ వ్యాపారుల నుంచి విముక్తి కలిగించాలనే సంకల్పమే ప్రభుత్వంలో కనిపించడం లేదు. ప్రభుత్వ రంగ బ్యాంకులు విధిగా రైతులకు రుణాలు ఇచ్చేలా ఒత్తిడి చేయడం ప్రభుత్వ బాధ్యత. అవసరమైతే సంపన్న రాష్ట్ర ప్రభుత్వం ఒక కార్పస్ ఫండ్ లాంటిది ఏర్పాటు చేయడమో మరో విధంగా రైతులకు తక్కువ వడ్డీకి రుణాలు అందేలా చూడటమో చేయాలి. ఈ దిశగా ప్రయత్నాలు జరిగిన దాఖలాలు లేవు. అసలు రుణమాఫీ అతిపెద్ద విఫల పథకం అనే విమర్శ ఉంది. ఒకేసారి రుణమాఫీ చేయకపోవడం వల్ల బ్యాంకులు తర్వాతి ఏడాది రుణాలు ఇవ్వకపోవడంతో అధిక వడ్డీలకు ప్రయివేటు అప్పులు తేవాల్సి వచ్చిందని కాంగ్రెస్ నేతలు అసెంబ్లీ సాక్షిగా వివరాలు చెప్పారు.
ఇతర పార్టీల వాళ్లను ఆకర్షించడానికి ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని కూడా ఉల్లంఘిస్తున్నారు. రైతులకు, ఇతర వర్గాల ప్రజలకు మేలు చేయడానికి ఎంతటి తెగువనైనా చూపుతారనే నమ్మకాన్ని ప్రజల్లో కలిగించాల్సిన అవసరం ఉంది.