తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కృష్ణా జలాల వివాదాన్ని అంతకంతకూ పెంచుకుని… తమ వైపు మాట్లాడుకుని పరిష్కరించుకునే ప్రయత్నం చేయకుండా… కేంద్రానికి ఫిర్యాదులు చేసుకున్నారు. ఇప్పుడు కేంద్రం స్పందించడం లేదని.. నేరుగా సుప్రీంకోర్టులో పిటిషన్లు వేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించుకున్నాయి. తమకు పొరుగు రాష్ట్రం అన్యాయం చేస్తోందని ఎవరికి వారు వాదిస్తున్నారు. న్యాయం మీరే చెప్పాలని సుప్రీంకోర్టు తలుపు తట్టడంద్వారా.. అక్కడే పరిష్కరించుకోవాలని అనుకుంటున్నారు.
కృష్ణా జలాల విషయంలో ఏపీ , తెలంగాణ రెండు ప్రభుత్వాలు మొండి వైఖరికి పోతున్నాయన్న అభిప్రాయంలో కేంద్రం ఉన్నట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో ఇద్దరూ రాజకీయం కోసం కలిసి గేమ్ ఆడుతున్నారన్న అభిప్రాయంలో కూడా కేంద్రం ఉంది. అందుకే.. అటు తెలంగాణ కానీ.. ఇటుఏపీ కానీ నేరుగా ప్రధానిని ఉద్దేశించిన లేఖలు రాసినప్పటికీ స్పందన లేకపోయింది. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి రెండు సార్లుప్రధానికి లేఖ రాశారు. కానీ.. ఎలాంటి చర్యలు లేవు. దీంతో తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి కొనసాగించి.. దిగువకు నీరు వదులుతూనే ఉంది. అదే సమయంలో.. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్ట్ పనులు ఆపాలని ఎన్జీటీతో పాటు కేఆర్ఎంబీ చెప్పినా ఆపడం లేదని.. తెలంగాణ వాదిస్తోంది. ఈ క్రమంలో ఎవరికి సర్ది చెప్పినా.. అది మరింత సమస్య అవుతుందన్న ఉద్దేశంతో కేంద్రం ఉంది.
ఈ వివాదాన్ని న్యాయపరంగా పరిష్కరించుకోవాలని తెలంగాణ, ఏపీ నిర్ణయించుకున్నాయి. తమ తమ వాదలను బలపరిచేలా పిటిషన్లు రెడీ చేసుకుంటున్నాయి. నేడో.. రేపో రెండు ప్రభుత్వాలు విడివిడిగా సుప్రీంలో పిటిషన్లు వేయనున్నాయి. ఈ వివాదం సుప్రీంకోర్టుకు చేరితే.. అంత సామాన్యంగా తేలే అవకాశం ఉండదు. అక్కడ అయినా కేంద్రం… తన వాదన ఏమిటో చెప్పాల్సి ఉంటుంది. గోడమీద పిల్లిలా ఉండే పరిస్థితి ఉండదు. అయితే కేంద్రానికి పరిష్కారం చేతకాకపోవడం వల్లనే ప్రభుత్వాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సి వస్తోందన్న అభిప్రాయం మాత్రం ప్రజల్లో ఏర్పడింది. అది చేతకానితనంగా ముద్రపడుతుంది. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే.. కేంద్రమే సమస్యను పరిష్కరించాల్సి ఉంది.