ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతు భరోసా కింద.. రూ. 12,500 ప్రతి మే నెలలో ఇస్తామని హామీ ఇచ్చింది. అయితే..సీఎంగా జగన్మోహన్ రెడ్డి మే నెల 30వ తేదీన ప్రమాణస్వీకారం చేశారు. దాంతో.. అక్టోబర్లో ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు. బడ్జెట్ లో కూడా నిధులు కేటాయించారు. అంత వరకూ బాగానే ఉన్నా… ఇప్పుడు.. రైతులకు రూ. 12,500 ఇవ్వడం లేదన్న ప్రచారం బయటకు వచ్చారు. కేవలం రైతుభరోసా కింద రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.6,500 మాత్రమే ఇస్తున్నామని.. అసెంబ్లీలో.. ఏపీ సర్కార్ ప్రకటించింది. దీంతో తెలుగుదేశం పార్టీ నేతలు విమర్శలు ప్రారంభఇంచారు. మిగతా రూ. ఆరు వేలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే కిసాన్ సమ్మాన్ నిధులతో సరిపెడతామని..రాష్ట్ర ప్రభుత్వమే ప్రకటించింది.
నిజానికి కేంద్ర ప్రభుత్వం.. ఈ నిధులను రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం లేదు. నేరుగా రైతుల ఖాతాల్లోనే వేస్తుంది. అదీ కూడా..కేంద్ర ప్రభుత్వం ఏడాదికి ఇచ్చే రూ.ఆరు వెలను ఒక్కసారిగా ఇవ్వడం లేదు. మూడు విడతలుగా…రూ.రెండు వేల చొప్పున జమ చేస్తారు. ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినట్లు అవుతుంది. అయితే.. ఎన్నికల హామీల్లో…కానీ.. ఇతర ప్రచారసభల్లో కానీ జగన్మోహన్ రెడ్డి..రైతు భరోసా కింద పెట్టుబడి సాయం..రూ. 12 వేల ఐదు వందల్ని.. ఏక మొత్తంగా రైతుల ఖాతాల్లో వేస్తామని ప్రకటించారు. ఎక్కడా కూడా.. కేంద్రం ప్రకటించిన కిసాన్ సమ్మాన్ పథకాన్ని కలిపేస్తామని కానీ.. ఆ సొమ్మును రూ. 12,500 ల నుంచి మినహాయిస్తామని కానీ.. చెప్పలేదు. చివరికి..కేబినెట్ నిర్ణయం తీసుకున్నప్పుడు కూడా.. ఇలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కానీ.. అసెంబ్లీకి ఇచ్చిన సమాచారంలో.. మాత్రం.. కేంద్ర కిసాన్ సమ్మాన్ పథకం.. రూ. ఆరు వేలు.. రాష్ట్ర ప్రభుత్వం రూ. ఆరు వేల ఐదు వందలు ఇస్తుందని చెప్పుకొచ్చారు. దీంతో.. రైతులకు.. ఏకమొత్తంలో ఒకే సారి పెట్టుబడి సాయం అందదు.
చంద్రబాబు సర్కార్.. అన్నదాత సుఖీభవ పేరుతో.. ఎన్నికలకు ముందే పెట్టుబడి సాయం పథకాన్ని ప్రవేశపెట్టింది. అప్పుడు చంద్రబాబు ..కిసాన్ సమ్మాన్ పథకంలో కేంద్రం ఇచ్చే రూ.ఆరు వేలు కాకుండా.. మరో రూ.తొమ్మిదివేలు కలిపి పదిహేను వేలు ఇచ్చేలా నిర్ణయం తీసుకున్నారు. పథకాన్ని ప్రారంభించారు కూడా. ఓ విడత డబ్బులు రైతుల అకౌంట్లలో జమ చేశారు. ఇప్పుడా పథకాన్ని జగన్మోహన్ రెడ్డి నిలిపి వేశారు. ఏపీ తరపున గత సర్కార్ రూ. 9 వేలు ఇస్తూంటే.. ఇప్పుడు..దాన్ని రూ. ఆరు వేల ఐదు వందలకే పరిమితం చేశారు. ఇది కూడా విమర్శలకు కారణం అవుతుంది. కేంద్రంతో సంబంధం లేకుండా.. జగన్మోహన్ రెడ్డినే..రూ.12,500 ఏడాదికి ఇస్తారనుకుంటే.. ఇలా చేస్తున్నారేమిటన్న చర్చ ప్రారంభమయింది. తెలుగుదేశం పార్టీ దీన్నో అస్త్రంగా మార్చుకుని రైతుల్లోకి వెళ్లే ప్రయత్నం ప్రారంభించబోతోంది.