అమరావతి నుంచి రాజధానిలోని పలు విభాగాలను తరలించడానికి న్యాయపరమైన చిక్కులు ఉన్నాయేమో కానీ.. కొత్తవి ఏర్పాటు చేయడానికి ఎలాంటి సమస్యలు లేవు. ఏపీ ప్రభుత్వానికి ఈ లాజిక్ బాగా నచ్చింది. వెంటనే కర్నూలు న్యాయరాజధానిలో ఓ వ్యవస్థ ఏర్పాటు చేయడానికి అవకాశం చిక్కింది. అంతే.. పాదరసంలా కదిలింది. కర్నూలులో రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది భవనాన్ని వెదుకుతోంది. త్వరలో.. ఖరారు చేసి.. కర్నూలులో రాష్ట్ర మానవహక్కుల కమిషన్‌ను ప్రారంభించబోతున్నారు.
ప్రస్తుతం మానవ హక్కుల కమిషన్ హైదరాబాద్‌లో ఉంది. దీనిపై హైకోర్టులో పిటిషన్లు పడ్డాయి. వాటిపై విచారణ జరిపిన హైకోర్టు ఆంధ్రప్రదేశ్ మానవ హక్కుల కమిషన్ పక్కరాష్ట్రంలో ఎందుకు ఉందని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. మన రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ మన రాష్ట్రంలోనే ఉండి తీరాలని స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోనే హక్కుల కమిషన్‌ను ఏర్పాటు చేయాలని ఆదేశాలిచ్చింది. హక్కుల కమిషన్‌తోపాటు లోకాయుక్త వంటి సంస్థలు రాష్ట్రంలోనే ఉండాల్సిన అవసరం ఉందని హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. దీంతో ప్రభుత్వానికి ఏపీలో మానవ హక్కుల కమిషన్ ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అప్పుడే ప్రభుత్వం చురుగ్గా ఆలోచించింది.అది న్యాయపరమైన వ్యవస్థ కాబట్టి.. దాన్ని కర్నూలులో పెట్టాలని డిసైడయింది.
కర్నూలు న్యాయరాజధానిగా హైకోర్టును పెట్టాల్సి ఉంది. కానీ ప్రస్తుతం ఆ నిర్ణయం పై ఇప్పుడల్లా క్లారిటీ వచ్చే అవకాశం లేదు. ఈ లోపు కొన్ని న్యాయపరమైన శాఖలను అక్కడకు పంపాలని అనుకున్నారు. కానీ కుదరలేదు. తరలింపుపై కోర్టు కేసులు ఉన్నాయి. నేరుగా హైదరాబాద్ నుంచి ఏపీలో ఎక్కడైనా మానవ హక్కుల కమిషన్‌ను పెట్టుకోవచ్చు కాబట్టి… ప్రభుత్వం కూడా కర్నూలును ఎంచుకుంది. హైకోర్టు కూడా..దీనిపై తప్పు పట్టే అవకాశాలు ఉండవని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే ఈ దిశగా ముందడుగు వేస్తోంది. ఆంధ్రప్రదేశ్ మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్‌గా కొన్నాళ్ల క్రితం విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మందాట సీతారామమూర్తి పేరును ప్రకటించారు. కార్యాలయం లేకపోవడంతో ఆయన ఇంట్లోనే బాధ్యతలు తీసుకున్నారు. ఇప్పుడు విధుల కోసం ఆయన కర్నూలు వెళ్లాల్సి ఉంటుంది.