ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు జూన్ 27 సోమవారం నాడు అమరావతిలోని సెక్రెటేరియట్ లో ఉద్యోగుల ప్రవేశాలు జరిగాయి. 29 న నలుగురు మంత్రులు తమ పేషీల్లో ప్రవేశిస్తున్నారు. 70 వరకూ డైరక్టరేట్లు, కమీషనరేట్లు , రాష్ట్రస్ధాయి ఆఫీసులు విజయవాడ, గుంటూరుల్లో ప్రారంభం కావలసి వుండగా విజయవాడలో 29, గుంటూరులో 6 నిన్న ప్రారంభమయ్యాయి. జిల్లా ఎడిషన్ లో ఆమేరకు కలర్ ఫొటోల్లో కవరేజీలు కూడా వచ్చాయి.
అయితే, ఈ ఆఫీసుల్లో పని ప్రారంభమవ్వడానికి తక్కువలో తక్కువగా మూడు నెలలు పడుతుంది. ఈ ఆఫీసులు ప్రారంభమైన భవనాల్లో 22 ఇంకా నిర్మాణదశలో వుండటమే ఇందుకు కారణం. ఏది ఏమైనా పరిపాలనకు ఆంధ్రప్రదేశ్ లోనే 27 న నాంది పడాలని ముఖ్యమంత్రి స్పష్టం చేయడంతో ఆయా శాఖల అధిపతులు భవనాలకోసం అన్వేషణ మొదలు పెట్టారు. ఒకో ఆఫీసుకి 20 వేల అడుగుల భవన వసతి కావాలి. అప్పటికే విజయవాడ, గుంటూరుల్లో భవన వసతికోసం విపరీతంగా డిమాండు పెరిగింది. దీంతో వేర్వేరు దశల్లో నిర్మాణాల్లో వున్న అపార్టు మెంట్లనే కార్యాలయాలుగా ఖాయపరచుకున్నారు. వాటిల్లోనే ప్రారంభోత్సవాలు జరిగాయి.
రాత్రీ పగలూ నిర్మాణాలు చేసినా సరే హెచ్చుభవనాలు రెండునెలలకు గాని పూర్తికావు. ఆతరువాత ఇంటీరియర్లు , ఆఫీసులకు అవసరమైన ఏర్పాట్లకు మరో నెల అప్పటికిగాని కార్యాలయాల పని మొదలుకాదు. (అయినా కూడా ప్రారంభించిన రోజునుంచే బిల్డర్ కి అద్దె చెల్లించుకోవాలి.) ఆతరువాతైనా చిన్న చిన్న సందులు గొందులు దాటుకుని చేరుకోవలసిన ఈ కార్యాలయాలకారణంగా వాహనాల రద్దీ వల్ల ఆయా వీధుల్లో వారికి తీవ్రమైన అసౌకర్యం తప్పదు.
హైదరాబాద్ లో కూడా ఇదేపరిస్ధితి…అయితే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ప్లాన్ ప్రకారం కడుతున్నారు. హైదరాబాద్ లో వుండటానికి మనకి పదేళ్ళు హక్కు వుంది. అన్ని ఆఫీసులూ కట్టుకున్నాకే వచ్చి వుంటే హడావిడి వత్తిడి అసౌకర్యాలు తప్పిపోయేవి.
ముఖ్యమంత్రి ఆదేశం 27 న అమలైందని చెప్పుకోడానికే తప్ప ఈ ఆఫీసుల్లో పని మాత్రం ఇప్పట్లో అవ్వదు. ఈలోగా ఉన్నతాధికారులు, వారి సిబ్బంది హైదరాబాద్ విజయవాడల మధ్య రాకపోకలకు విమానం చార్జీలు, స్టార్ హోటళ్ళలో బిల్లులు అదనపు ఖర్చే మరి!