పరిపాలనా సంబంధమైన విషయాల్లో తప్ప రాజకీయంగా తెలుగుదేశం పట్ల మొహమాటం గా వుండవలసిన అవసరంలేదని బిజెపి అగ్రనాయకత్వం ఇచ్చిన సంకేతం కేడర్ లో హుషారు పెంచుతున్నది.
తూర్పు గోదావరిజిల్లా బెండమూర్లంక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రారంభోత్సవంలో టీడీపీ, బీజేపీ కార్యకర్తలు పరస్పరం నినాదాలతో హోరెత్తించారు. టీడీపీ కార్యకర్తలు జై చంద్రబాబంటే, బీజేపీ కార్యకర్తలు జై నరేంద్రమోడీ అని పోటా పోటీగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన వైద్య ఆరోగ్య మంత్రి కామినేని శ్రీనివాస్, ఉపముఖ్యమంత్రి కూడా అయిన హోంమంత్రి చిన రాజప్ప తమ కార్యకర్తలపై విసుక్కున్నారు. చంద్రబాబు, నరేంద్రమోడీ కలిసి పనిచేస్తుంటే, కార్యకర్తల మధ్య గొడవేంటని మండిపడ్డారు. ఒక దశలో సహనం కోల్పోయిన హోంమంత్రి… సైలెంటుగా ఉండకపోతే లోపలేయిస్తానని తీవ్ర స్వరంతో హెచ్చరించారు.
తాడేపల్లిగూడెం లో బిజెపి నాయకుడైన దేవాదాయ మంత్రి మాణాక్యాలరావు, తెలుగుదేశం పార్టీకి చెందిన జిల్లాపరిషత్ చైర్మన్ ముళ్ళపూడి బాపిరాజు వర్గాల ఆధిపత్య పోరు మంత్రి రాజీనామా బెదరింపుదాకా వెళ్ళింది. జిజెపికి చెందిన రాజమండ్రి టౌన్ ఎమ్మెల్యే డాక్టర్ ఆకుల సత్యనారాయణ, తెలుగుదేశానకి చెందిన రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వర్గాల మధ్య సరిహద్దు తగాదాలు ఎప్పటికీ ముగుసేవి కాదు.
మిత్రపక్షమే కాకుండా కేంద్రంలో, రాష్ట్రంలో అధికార భాగస్వామిగా వున్నా కూడా తెలుగుదేశం జన్మభూమి కమిటీల్లో తనకు చోటు ఇవ్వనందుకు ఆకమిటీల నియామకాలు జరిగి నప్పటినుంచీ బిజెపి గుర్రుగా వుంది. పార్టీ విస్తరణకోసం మొహమాటాలు వద్దని పార్టీ సూచించినప్పటినుంచీ మార్పు మొదలైంది.
మంత్రికామినేనికి బిజెపితో పెద్ద అనుబంధం లేదు…ఎమ్మెల్యే టికెట్ కోసం తెలుగుదేశంలో పెద్ద పోటీ వుండటంతో ఆయన బిజెపిలో చేరి మిత్రపక్షంకోటాలో టికెట్ సాధింది ఎమ్మెల్యే అదే కోటాలో మంత్రి అయ్యారని చెబుతూ వుంటారు. ఏమైనా మంత్రులు కామినేని, చినరాజప్పల మధ్య ఏవిబేధమూ లేదు వారి సభలోనే బిజెపి నినాదాలు చేయడమంటే అది పార్టీ ఉనికి ని చూపించడమే!
ఇది ఇకమీదట ప్రభుత్వ కార్యక్రమాల్లో నినాదాల హోరుతో బిజెపి ఉనికినీ బలాన్నీ చాటబోతోందనడానికి సంకేతంగానే కనిపిస్తోంది.