తమిళనాడు (234 స్థానాలు): ఈసారి ఎన్నికలలో ముఖ్యమంత్రి జయలలితకి ఓటమి తప్పదని సర్వేలు చెప్పినప్పటికీ, ఆమె నేతృత్వం వహిస్తున్న అధికార అన్నాడిఎంకె పార్టీయే ప్రస్తుతం పూర్తి ఆధిక్యతతో కొనసాగుతోంది. కరుణానిధి నేతృత్వంలో డిఎంకె పార్టీ కూడా మొదటి రెండు రౌండ్స్ లెక్కింపులో అన్నాడిఎంకెతో పోటీ పడినప్పటికీ క్రమంగా రేసులో వెనుకపడింది. తాజా సమాచారం ప్రకారం అన్నాడిఎంకె పార్టీ-129, డిఎంకె-82, డిఎండికె-01, పి.ఎం.కె.-4 స్థానాలలో ఆధిక్యతలో సాగుతున్నాయి. తమిళనాడులో అడుగుపెట్టాలనే భాజపా ఆశలు అడుగంటిపోయినట్లే. ఇంతవరకు అది ఎక్కడా పూర్తి అధిక్యత కనబరచలేకపోయింది.
కేరళ (140 స్థానాలు): కేరళలో సర్వే ఫలితాలకు అనుగుణంగానే ఎన్నికల ఫలితాలు వస్తున్నాయి. వామపక్షాల నేతృత్వంలోని ఎల్.డి.ఎఫ్.కూటమికి 89 స్థానాలలో ఆధిక్యతలో సాగుతుంటే, కాంగ్రెస్ నేతృత్వంలోని అధికార యు.డి.ఎఫ్. కూటమి కేవలం 49 స్థానాలలో మాత్రమే ఆధిక్యతలో ఉన్నందున దాని పరాజయం దాదాపు ఖరారు అయినట్లే భావించవచ్చు. కేరళలో కూడా భాజపాకి నిరాశే మిగిలింది.
పశ్చిమ బెంగాల్ (294 స్థానాలు): రాష్ట్రంలో ఊహించినట్లుగానే ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని అధికార తృణమూల్ కాంగ్రెస్ కౌంటింగ్ మొదలయినప్పటి నుంచే ఆధిక్యతలో దూసుకుపోతోంది. కనుక మమతా బెనర్జీఏ మళ్ళీ ముఖ్యమంత్రి కావడం దాదాపు కహారారు అయిపోయినట్లే చెప్పవచ్చు. తృణమూల్ కాంగ్రెస్-211, కాంగ్రెస్+వామ పక్షాల కూటమికి -72, భాజపా-7, ఇతరులు-4 స్థానాలలో ఆధిక్యతలో కొనసాగుతున్నాయి.
అసోం (126 స్థానాలు): అసోం రాష్ట్రంలో కూడా సర్వే ఫలితాలకు అనుగుణంగానే ఎన్నికల ఫలితాలు వస్తున్నాయి. భాజపా-57, అధికార కాంగ్రెస్-17,ఎ.ఐ.డి.యు.ఎఫ్.-2, ఇతరులు-2స్థానాలలో ఆధిక్యతలో కొనసాగుతున్నాయి.
కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి (30 స్థానాలు): పుదుచ్చేరిలో కాంగ్రెస్-09, అధికార ఎ.ఐ.ఎన్.ఆర్.సి.-06 అన్నాడిఎంకె-02, ఇతరులు-0 స్థానాలలో ఆధిక్యతలో కొనసాగుతున్నాయి.