డిల్లీలో రెండు ప్రభుత్వాలు నడుస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఒకటి కేంద్ర ప్రభుత్వం రెండవది అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలో డిల్లీ ప్రభుత్వం. రెండవ దానికి ముఖ్యమంత్రి, శాసనసభ, హైకోర్టు అన్నీ ఉన్నా కూడా రాష్ట్ర హోదా మాత్రం లేదు.
1952లోనే డిల్లీని వేరు చేసి దానికి శాసనసభని కూడా ఏర్పాటు చేసారు. సుమారు నాలుగేళ్ల తరువాత దానిని రద్దు చేశారు. మళ్ళీ 1993లో డిల్లీని కేంద్రపాలిత దేశ రాజధాని డిల్లీగా విడదీసి దానికి శాసనసభను ఏర్పాటు చేసారు. అప్పటి నుంచే డిల్లీకి సంపూర్ణ రాష్ట్ర హోదా ఇవ్వాలనే డిమాండ్ ఉంది. 11 జిల్లాలతో కూడిన డిల్లీకి ప్రత్యేక పరిపాలనా వ్యవస్థ, హైకోర్టు, ముఖ్యమంత్రి , 70 మంది శాసనసభ్యులు ఉన్నప్పుడు రాష్ట్ర హోదా ఎందుకు ఇవ్వరనే సందేహం కలగడం సహజం.
దేశ రాజధానిగా ఉన్న డిల్లీని వేరే రాష్ట్రంగా ఏర్పాటు చేస్తే దాని వలన అనేక సమస్యలు వస్తాయనే భయంతోనే కేంద్ర ప్రభుత్వం వెనుకంజ వేస్తోంది. కానీ కాంగ్రెస్, భాజపాతో సహా చాలా రాజకీయ పార్టీలు డిల్లీకి రాష్ట్ర హోదా ఇస్తామని హామీలు ఇచ్చినవే కనుక మోడీ ప్రభుత్వం ఆ హామీని నిలబెట్టుకోవాలని డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కోరుతున్నారు.
ఆమాద్మీ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో కూడా డిల్లీని ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చింది. కనుక అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం దాని కోసం ఒక ముసాయిదా బిల్లుని రూపొందించి నిన్న విడుదల చేసింది. వచ్చే నెల 30వరకు ఆ బిల్లుపై ప్రజలు, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నుంచి అభిప్రాయ సేకరణ చేసి, వారి సూచనలు, సలహాల మేరకు దానిలో అవసరమైన మార్పులు చేర్పులు చేసి, శాసనసభలో ప్రవేశపెట్టి దానికి ఆమోదముద్ర వేసి కేంద్రానికి పంపిస్తామని అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. దీని కోసం అఖిలపక్ష పార్టీల సమావేశం ఏర్పాటు చేసి అన్ని పార్టీల మద్దతు కూడా గడతామని అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు.
డిల్లీకి ప్రత్యేక రాష్ట్ర హోదా కల్పించడం ఆమాద్మీ ఎన్నికల మ్యానిఫెస్టో ఉంది గాబట్టే అరవింద్ కేజ్రీవాల్ దాని కోసం ప్రయత్నాలు ప్రారంభించినట్లు పైకి కనబడుతున్నప్పటికీ, వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్, పంజాబ్ శాసనసభలకు జరుగబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొనే ఆయన దీనిని పైకి తీసి ఉండవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే డిల్లీలో పంజాబీలు చాలా అధిక సంఖ్యలో స్థిరపడ్డారు. వారితో ఆమాద్మీ పార్టీకి మంచి అనుబంధమే ఏర్పడింది. కనుక వచ్చే ఎన్నికలలో ఆమాద్మీ పార్టీని పంజాబ్ కి కూడా విస్తరించాలని అరవింద్ కేజ్రీవాల్ చాలా పట్టుదలగా ఉన్నారు. అప్పుడే చాలాసార్లు పంజాబ్ వెళ్లి వచ్చేరు కూడా. మళ్ళీ ఈసారి ఆయన పంజాబ్ వెళ్ళినపుడు ఇదే విషయం ప్రధానంగా ప్రస్తావించి అక్కడి ప్రజలను ఆకట్టుకొనే ప్రయత్నం చేయవచ్చు.