దేశంలో కరోనా భయం హైస్పీడ్‌లో పెరుగుతోంది. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత కూడా.. కేసులు జెట్ స్పీడ్‌తో పెరుగుతున్నాయి. దీంతో ఇప్పటికే పలు రాష్ట్రాలు… కరోనా ఆంక్షలు విధించాయి. తాజాగా తెలంగాణ సర్కార్.. విద్యాసంస్థల్ని మూసేస్తూ నిర్ణయం తీసుకుంది. కేజీ నుంచి పీజీ అన్ని విద్యా సంస్థలూ మూసేస్తున్నారు. ఆన్ లైన్ క్లాసులు మాత్రం చెప్పుకోవచ్చు. మెడికల్ కాలేజీలకు మినహాయింపునిచ్చారు. ఇటీవలి కాలంలో తెలంగాణ స్కూళ్లు, కాలేజీల్లో పెద్ద ఎత్తున కరోనా కేసులు బయటపడుతున్నాయి. దీంతో తెలంగాణ సర్కార్ అప్రమత్తమయింది. స్కూళ్లను తాత్కాలికంగా మూసేయాలని నిర్ణయించుకుంది. అదే సమయంలో కేంద్రం కూడా కొత్త జాగ్రత్తలు తీసుకుంది. ఏప్రిల్ నెల మొత్తం.. ప్రత్యేకమైన ఆంక్షలు విధించాలని నిర్ణయించారు.
టెస్ట్, ట్రాక్, ట్రీట్ తప్పనిసరిగా పాటించాలని రాష్ట్రాలకు కేందత్రం స్పష్టమైన సూచన చేసింది. అలాగే వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలని .. ఆర్టీపీసీఆర్ టెస్టులను 70శాతానికి పెంచేలా చూడాలని స్పషఅటం చేసింది. మళ్లీ కంటోన్మెంట్ జోన్ల ప్రక్రియను ప్రారంభించనున్నారు. ఇప్పటికైతే.. ప్రయాణాలపై ఎలాంటి ఆంక్షలు విధించవద్దని కేంద్రం స్పష్టం చేసింది. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి నలభై ఐదేళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. కరోనా విపరీతంగా పెరుగుతున్నందున వీలైనంత మందికి వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించారు. రాష్ట్రాలకు కూడా అదే సమాచారం పంపారు. కొద్ది రోజుల కిందట వరకూ కరోనా భయం అంతం అయిపోయిందని అనుకున్నారు.
కానీ అనూహ్యంగా గత ఏడాది ఏ సమయంలో అయితే కరోనా ఉద్ధృతి పెరిగిందో.. ఈ సారి కూడా అదే సమయలో.. మళ్లీ కరోనా బుసలు కొడుతోంది. కేంద్రం ఏప్రిల్ నెల పరిస్థితిని బట్టి… ఆంక్షల్ని మరింత పొడిగించే అవకాశం ఉంది. తెలంగాణతో పాటు మరికొన్ని రాష్ట్రాలు కూడా.. ఆంక్షలను విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో కరోనా లాక్ డౌన్ నాటి పరిస్థితులు మళ్లీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.