ప్రస్తుతమున్న విలువ ఆధారిత పన్నుల వ్యవస్థ (వ్యాట్) స్థానంలో వస్తువులు, సేవల పన్ను (జిఎస్టి)ను ప్రవేశం ప్రస్తుతానికి తెరవెనక్కి వెళ్ళింది. కాంగ్రెస్ ను ఓడించినందుకు బిల్లుని నిరాకరించడం ద్వారా ద్వారా ప్రజలమీద కక్ష తీర్చుకుంటున్నారని సోనియా ను బిజెపి ఆడిపోసుకుంటున్న రాజకీయాల్ని పక్కన పెడితే జిటిఎస్ రాష్ట్రాలకు ఇష్టం లేదన్న వాస్తవం మాయమైపోయింది. దీన్ని బయటకు తీసుకురావాలని మీడియా కూడా మరచిపోయింది. లేదా పక్కన పెట్టేసింది. జిఎస్టిని ప్రవేశపెట్టడానికి ఉద్దేశించిన 122వ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్రం గత డిసెంబరులోనే రాషా్ట్రల ఆర్థిక శాఖా మంత్రుల సమావేశం లో చర్చకు పెట్టింది. ఆ సమావేశంలో మెజార్టీ రాషా్ట్రలు బిల్లును తిరస్కరించాయి. రాషా్ట్రల అభిప్రాయాలు ఎలా ఉన్నప్పటికీ జిఎస్టి విషయంలో కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళ్లడానికే నిర్ణయించుకుని, లోక్ సభలో గెలిపించుకుని రాజ్యసభ గడపవరకూ తీసుకువచ్చి కాంగ్రెస్ సహకారంలేక ఆగిపోయింది. రాజ్యసాభలో కూడా బిల్లు నెగ్గి వున్నా కూడా 50 శాతం రాష్ట్రాలు బిల్లుని ఆమోదించాలి. పార్లమెంటులో పనైపోతై సంగం రాష్ట్రాల మద్దతుకి కేంద్రం వద్ద సామదానబేధ దండోపాయాలు వుండనే వున్నాయి.
ఇప్పటిదాకా రాష్ట్ర పన్నుల జాబితాలో ఉన్న వివిధ వస్తువులను, సేవలను కేంద్ర పరిధిలోకి తీసుకురావాలని భావిస్తుండటమే రాషా్ట్రల వ్యతిరేకతకు కారణం. రాష్ట్ర ఆదాయ వనరులతో పాటు స్థానిక సంస్థలకు వచ్చే అరకొర ఆదాయాన్ని కూడా కొల్లగొట్టడానికి ప్రతిపాదిత బిల్లు ద్వారా కేంద్రం రంగం సిద్ధం చేసుకుంటోందన్నది రాషా్ట్రల వాదన. అదే జరిగితే ప్రతి ఆర్థిక అవసరం కోసం కేంద్ర దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సిన పరిస్థితి దాపురిస్తుందన్న ఆందోళన రాష్ట్ర ప్రభుత్వాల్లో వుంది. పరోక్ష పన్నుల ఆదాయంతోనే రోజులు గడుపుతున్నందున దానికి గండిపడితే మనుగడ సాగించలేమని చాలా రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా పెట్రోలు, ఐఎంఎఫ్ఎల్ (మద్యం), పొగాకు ఉత్పత్తులపై రాష్ట్రాలకు ఎక్కువ మొత్తంలో పన్ను వసూలు అవుతున్నది. కేంద్ర ప్రతిపాదించే జిఎస్టిలో ఇవి కూడా ఉండటంపై రాష్ట్ర ప్రభుత్వాలు అభ్యంతరం చెప్పాయి. అదే విధంగా వివిధ సేవలపై రాష్ట్ర ప్రభుత్వాలు సర్వీస్టాక్సు వసూలు చేస్తుంటుంది. జిఎస్టి అమల్లోకి వచ్చేస్తే సేవల పన్నులను కూడా రాష్ట్ర ప్రభుత్వాలు వేసేందుకు అవకాశం ఉండదు. అదే విధంగా స్థానిక సంస్థలు వసూలు చేసే సెస్‌లను కూడా కోల్పోవాల్సి వస్తున్నది. స్థానిక సంస్థల పేరుతో వసూలు చేసే సెస్‌లు రాష్ట్ర ప్రభుత్వాల ఖాతాలోనే జమవుతున్నాయి. ఇలాంటి అన్ని ఆదాయాలను రాష్ట్రాలు కోల్పోవాల్సి వస్తుందనేది రాష్ట్ర ప్రభుత్వాల అభ్యంతరం.
దీనికి పరిష్కారంగా తాము కోల్పోయే ఆదాయాన్ని తమకు ఏదో ఒక రూపంలో అందివ్వాలని రాష్ట్ర ప్రభుత్వాలు డిమాండ్ చేశాయి. వాటన్నింటికి కేంద్రం సూత్రప్రాయంగా అంగీకరించింది. అయితే ఈ విషయమై రాష్ట్రానికీ, రాష్ట్రానికీ మధ్య ఏకాభిప్రాయం తీసుకురావడం సాధ్యం కాదు. ఎందుకంటే ఎవరి వనరులు వారివే.
ఆర్థిక వనరులన్నింటినీ కేంద్రీకృతం చేసుకునే దిశలో కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఈ ప్రతిపాదన రాజ్యాంగ ఫెడరల్ స్వభావాన్ని దెబ్బతీస్తుంది.
రాజ్యాంగంలో పేర్కొన్న రాషా్ట్రల స్థానిక సంస్థల హక్కులకు గండిపెట్టే అవకాశం ఉంది. రాషా్ట్రల హక్కులను హరించే పలు అంశాలు ఉన్న కారణంగానే జిఎస్టి ప్రతిపాదన ఏళ్ల తరబడి చర్చలకు పరిమితమవు తోంది. 2007 ఫిబ్రవరి నెలలో జిఎస్టి ప్రతిపాదన ను కేంద్ర ప్రభుత్వం ముందుకు తీసుకువచ్చింది. ప్రస్తుతమున్న విధానాన్ని సరళతరం చేయడం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జాబితాలో ఉన్న వనరులను సమీక్షించడం, అధికార యంత్రాంగంపై భారాన్ని తగ్గించడం, పారిశ్రామికవేత్తలకు స్నేహహస్తాన్ని అందించడం, పారదర్శకంగా పన్నుల వ్యవస్థను నిర్వహించడం లక్ష్యాలుగా అప్పట్లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
వ్యాట్ అమలుకు దూరంగా ఉన్న వివిధ వస్తువులను, సేవలను పన్నుల చట్రం పరిధిలోకి తీసుకురావడం ద్వారా ఖజానాకు భారీ ఆదాయాన్ని జమచేయాలన్నది అసలు ఉద్దేశం.
వివిధ అభివృద్ధి చెందిన దేశాల్లో ఇప్పటికే ఉనికిలో ఉన్న జిఎస్టి విధానాన్నే భారత దేశంలోనూ అమలు చేయాలన్న మల్టీనేషనల్ కంపెనీల డిమాండ్ కూడాపెద్ద కారణం. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో విదేశీ పెట్టుబడులు దేశీయంగా వినియోగించుకుంటున్నందువల్ల ఆ సంస్థల డిమాండ్‌ను అమలుచేసి తీరాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద వుంది. ఈ కారణంగానే కేంద్రంలో అధికారం చేతులు మారినా జిఎస్టి అమలు విషయంలో ప్రభుత్వ వైఖరి మారలేదు, మారదు కూడా.
అదే సమయంలో రాషా్ట్రల స్థానిక సంస్థల హక్కులను ఏమాత్రం పట్టించుకోకుండా ముందుకు వెళ్లడానికి కేంద్రం సిద్ధపడటమే ఆందోళనకరం. రాషా్ట్రల ఆర్థిక బలోపేతానికి, ఫెడరల్ స్ఫూర్తికి అద్దం పట్టే ఈ హక్కులను రాజ్యాంగంలో స్పష్టంగా పేర్కొన్నారు. 246వ అధికరణంలోని ఏడవ షెడ్యూల్ లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పన్నుల అధికారాలను, పరిధిని రాజ్యాంగం పేర్కొంది. అదే విధంగా వివిధ పన్నులు, సుంకాల పేరుతో కేంద్రం చేసే వసూళ్ళనూ రాష్ట్ర ప్రభుత్వాలకు ఎలా పంచాలన్న విషయంలోనూ విధివిధానాలను నిర్దేశించింది. బలమైన రాషా్ట్రలతోనే దృఢమైన కేంద్రం ఏర్పడుతుందని రాజ్యాంగ నిర్మాతలు భావించారు. ఆ దిశలోనే రాషా్ట్రల హక్కులకు ప్రాధాన్యత ఇస్తూ ఫెడరల్ స్ఫూర్తికి పెద్దపీట వేశారు.
అయితే, కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఈ స్ఫూర్తికి పూర్తి విరుద్ధ దిశలో పయనిస్తోంది. రాషా్ట్రల అభిప్రాయాలతో నిమిత్తం లేకుండా ప్రణాళికా సంఘాన్ని ఇప్పటికే రద్దు చేసింది. కీలకమైన ఈ నిర్ణయం తీసుకునే ముందు రాషా్ట్రలతో నామమాత్రపు చర్చ కూడా కేంద్ర ప్రభుత్వం చేయకపోవడం గమనార్హం. రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన తరువాత ప్రత్యామ్నాయ వ్యవస్థ కోసం రాషా్ట్రల తో చర్చ పెట్టింది. జిఎస్టి అమలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు లేవనెత్తుతున్న న్యాయబద్ధమైన డిమాండ్లనూ పరిగణలోకి తీసుకునే దిశలో కేంద్ర ప్రభుత్వ చర్యలు కనపడటం లేదు. ఆర్థిక శాఖా మంత్రుల సమావేశంలో మెజార్టీ రాషా్ట్రల వ్యతిరేకత వ్యక్తం చేసినా,కూడా బిల్లుని ముందుకే నడిపించారు.
ఇటీవల కాలంలో కేంద్రం నుంచి రాషా్ట్రలకు అందుతున్న నిధుల మద్దతు క్రమేణా తగ్గిపోతోందని రాష్ట్ర ప్రభుత్వాలు ఆందోళనను వ్యక్తం చేస్తున్నాయి. రాషా్ట్రల్లో పెట్టుబడి వ్యయం పెంచి, ఉత్పాదకతను, ఉపాధి అవకాశాలను మెరుగుపరిచే ప్రణాళిక ఖర్చులకు బడ్జెట్ ద్వారా చేసే కేటాయింపుల్లో కోత పెట్టే వైఖరికి కేంద్రం పూనుకోవడమే దీనికి కారణం. వివిధ స్పాన్సర్డ్ స్కీమ్స్ ద్వారా కేటాయించే నిధుల్లో సొంతపార్టీ అధికారం వున్న రాషా్ట్రలకు , రాజకీయ అవసరాలు వున్న రాష్ట్రాలకు ప్రాధాన్యత లభిస్తోంది. దీంతో న్యాయబద్ధంగా తమకు దక్కాల్సిన వాటాను రాషా్ట్రలు కోల్పోతున్నాయి.
ఈ నేపథ్యంలోనే రాషా్ట్రల హక్కులకు, ఫెడరల్ వ్యవస్థ పరిరక్షణకూ ప్రాధాన్యత పెరిగింది. రాష్ట్రాలను పరాధీనులుగా మార్చేసే ఈ తరహా చర్యలు దేశహితానికి, విశాల ప్రజాప్రయోజనాలకు మంచివి కావు.