పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంపై ఎవరికీ పెద్దగా పట్టింపు లేదు. కానీ అక్కడ ఎవరెవరి విగ్రహాలు పెట్టాలన్నదానిపై మాత్రం పంచాయతీ ప్రారంభమయింది. ఏపీ నోటి పారుదల మంత్రి అనిల్ కుమార్ నాలుగు రోజుల కిందట.. పోలవరం ప్రాజెక్ట్‌ను సందర్శించారు. అక్కడ జరుగుతున్న పనులపై సమీక్ష చేశారో లేదోకానీ.. అక్కడ 150 అడుగుల వైఎస్ విగ్రహాన్ని పెట్టే విషయంలో మాత్రం అధికారులతో చర్చించారు. స్థల పరిశీలన చేశారు. అందు కోసం రూ. రెండు వందల యాభై కోట్లను కేటాయించబోతున్నట్లుగా ప్రభుత్వ వర్గాలు కూడా సమాచారం మీడియాకు ఇచ్చాయి. ముందుగా ప్రాజెక్ట్ కట్టండి … తర్వాత విగ్రహాల గురించి ఆలోచిద్దామని.. విపక్ష నేతలు సెటైర్లు కూడా వేశారు. అధికార, విపక్షాల మధ్య… ఆ మంటలు.. మంటలు అలా ఉండగానే.. సీన్లోకి సోము వీర్రాజు వచ్చేశారు.
సోము వీర్రాజు.. పోలవరం ప్రాజెక్ట్ వద్ద వాజ్‌పేయి విగ్రహాన్ని పెట్టిస్తామని ప్రకటించారు. పోలవరం ప్రాజెక్ట్ జాతీయ ప్రాజెక్ట అని.. ఆ ప్రాజెక్టుకు సంబధించి ప్రతీ రూపాయి… కేంద్రం ఇస్తుందని.. కాబట్టి.. అక్కడ వాజ్ పేయి విగ్రహం పెట్టడానికి తమకు మాత్రమే హక్కు ఉందని ఆయన ఉద్దేశం. ఇక్కడా విపక్షాల నుంచి అవే విమర్శలు వస్తున్నాయి. ముందుగా పోలవరం కట్టండి.. ఆ తర్వాత విగ్రహాలు పెట్టుకోమని సూచిస్తున్నారు. అసలు ప్రాజెక్ట్ భవిష్యత్ ఇప్పుడు రిస్క్‌లో పడింది. కేంద్రం ఎన్ని నిధులిస్తామంటుందో… రాష్ట్రం ఎన్ని అడిగిందో.. అసలు ఇస్తారో లేదో క్లారిటీ లేకుండా పోయింది.
పోలవరంలో పనులు.. ఓ భారీ అపార్టుమెంట్ నిర్మాణం సాగినట్లుగా సాగుతున్నాయి. కానీ చురుకుదనం లేదు. గేట్ల కోసం.. కసరత్తు ప్రారంభం కాలేదు. కానీ.. సమయాన్ని మాత్రం ఏడాది తర్వాత ఏడాది పెంచుకుంటూ పోతున్నారు. ఏడాదిన్నర కిందట.. అధికారం చేపట్టినప్పుడు వైసీపీ 2021లో పూర్తి చేస్తామని ప్రకటించింది.ఇప్పుడు సీఎం 2022 అంటున్నారు. పరిస్థితులు ఇలాగే ఉంటే.. .. వచ్చే ఏడాది.. వచ్చే ఏడాది అని చెప్పుకుంటూ పోవడమే తప్ప.. ఏపీ జీవనాడి సిద్ధమయ్యే పరిస్థితి ఉండదు. కానీ రాజకీయ నేతలు మాత్రం.. విగ్రహాల గురించి ఎక్కువగా ఆలోచించేస్తున్నారు .