తెలుగు రాష్ట్రాలలో ఎన్నికల గంట మోగింది. ఇక నుంచి ఏ టీవీ ఛానల్ చూసినా, ఏ పేపర్ తిప్పినా.. ఎన్నికల వార్తలే. ఏ ఇద్దరు కలసినా రాజకీయం ముచ్చట్లే. ఈ ప్రభావం టాలీవుడ్‌పై పడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. పైగా ఈసారి ఎన్నికలు నువ్వా? నేనా? అన్నట్టు సాగబోతున్నాయి. అందుకే.. ఈ ఫీవర్ టాలీవుడ్‌కీ తాకడం ఖాయంగా కనిపిస్తోంది.
ప్రతీ యేటా వేసవిలో భారీ చిత్రాలు వరుస కడతాయి. ఈ వేసవిలో పెద్ద సినిమాల తాకిడి తక్కువే ఉంది. `మహర్షి` ఉన్నా. అది ఎంచక్కా.. ఎన్నికల హడావుడి అయ్యాక మే 9న విడుదల అవుతుంది. కాబట్టి ఈ సెగ మహేష్ సినిమాకి తగలదు. ఇక ఈలోపు వస్తున్న జెర్సీ, మజిలీ, సీత. కాంచన 3 ఇవన్నీ ఎన్నికల సీజన్లోనే వస్తున్నాయి. అటు ప్రచారం, ఇటు పోలింగ్ వీటి మధ్య ఈ సినిమాల వసూళ్లపై ప్రభావం చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మధ్యలో ఐపీఎల్ ఉండనే ఉంది. అసలే ఈ యేడాది టాలీవడ్ జాతకం అంతంతమాత్రంగానే ఉంది. వేసవిలో అయినా.. భారీ విజయాల్ని సొంతం చేసుకోవాలని నిర్మాతలు ఆశ పడుతున్నారు. ఇప్పుడున్న రాజకీయ వేడిలో సినిమాలపై జనాలు దృష్టి పెట్టాలనుకోవడం అత్యాసే అవుతుంది. సో.. ఈ సినిమాలన్నీ వాయిదా పడతాయా? లేదంటే మొండిగా.. ముందడుగు వేస్తాయా? అనేది ఆసక్తికరంగా మారింది.