ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన అంశం వైఎస్ వివేకానందరెడ్డి హత్య. ఆయన ఇంట్లోనే ఆయన దారుణహత్యకు గురి కావడం… గుండెపోటుగా చెప్పి అందర్నీ నమ్మించే ప్రయత్నం చేయడం.. చివరికి..దారుణ హత్య అని బయటపడటంతో.. రాజకీయ దుమారం రేగింది. మొదట్లో.. గుండెపోటు అని చెప్పడం ప్రారంభించిన వైసీపీ నేతలు… హత్య అని తేలే సమయానికి… నేరుగా.. టీడీపీ అధినేత చేయించారనే ఆరోపణలు ప్రారంభించారు. దానికి కౌంటర్‌గా… చంద్రబాబు కూడా.. ఇంట్లో కుటుంబసభ్యుడినే హత్య చేసిన వారు.. ఏమైనా చేస్తారంటూ విమర్శలు చేశారు. చివరికి.. చంద్రబాబు విమర్శలు విచారణ మీద ప్రభావం చూపిస్తున్నాయంటూ… జగన్ కోర్టుకు వెళ్లి.. ఆ మాటల్ని ఆపు చేయించగలిగారు. సీబీఐ విచారణ కోరుతూ దాఖలైన పిటిషన్ కోర్టులో ఉంది. అయితే.. సిట్ మాత్రం విచారణ కొనసాగించాలని కోర్టు ఆదేశించింది.
ఇప్పుడు ఎన్నికలు ముగిసిపోయాయి. కానీ వివేకానందరెడ్డి హత్య కేసు ఏమయిందో ఎవరికీ తెలియడం లేదు. సాక్ష్యాల తారుమారు పేరుతో ముగ్గుర్ని అరెస్ట్ చేశారు. వారికి అంతా తెలుసంటూ.. పోలీసులు చెబుతున్నారు. వారిని కస్టడీకి తీసుకుని మరీ ప్రశ్నించారు. కానీ.. ఏ విషయమూ తేలడం లేదు. ఆ కేసులో ఎలాంటి ముందడుగూ పడటం లేదు. తన తండ్రి హత్య విషయంపై.. గతంలో రోజుమార్చి రోజు .. వీడియోలు విడుదల చేసి.. ఢిల్లీ నుంచి అమరావతి వరకూ ఫిర్యాదులు చేసిన వైఎస్ వివేకా కుమార్తె సునీతా కూడా.. తమకు విచారణ ముందుకు సాగకపోవడమే కావాలన్నట్లుగా.. ఏమీ మాట్లాడటం లేదు.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో.. అసలేం జరిగిందనేది.. విచారణలో చాలా సులువుగా వెల్లడయి ఉంటుందనేది.. ఇలాంటి వ్యవహారాలను పరిశీలించేవారందరికీ తెలిసిన విషయం. నేర నిపుణులు కూడా అదే చెబుతున్నారు. కానీ.. మన దేశంలో.. చట్టం, న్యాయం, పోలీసులు అందరూ.. అధికారానికి బద్దులై ఉంటారు. ఇప్పుడు ఎన్నికలు జరిగాయి కాబట్టి.. వచ్చే ప్రభుత్వాన్ని బట్టి విచారణ తీరు మారినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అందుకే.. పోలీసులు కూడా సైలెంట్‌గా ఉన్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మామూలుగా అయితే.. సాక్ష్యాలను చెరిపేయడం చాలా పెద్ద కేసు. దాన్నే పోలీసులు పట్టించుకోవడంలేదు. అలా పట్టించుకుంటే.. అవినాష్ రెడ్డి ఈ పాటికి జైల్లో ఉండేవారు. దీన్నే పట్టించుకోకపోతే.. ఇక మర్డర్ కేసునేం పట్టించుకుంటారు..?