శత్రువు భయంకరం. దొరికితే పట్టేస్తాడు. అలాంటప్పుడు…దొరక్కుండా దాక్కోవడమే గొప్ప విజయం. ఇప్పుడు.. కరోనాతో పోరాటంలో అదే నీతిని ప్రపంచం పాటిస్తోంది. కరోనా ప్రళయం ఎలా ఉండబోతోందో.. అంచనా వేయడం అసాధ్యంగా మారింది. వైరస్‌కు దొరకకుండా.. ప్రజంలతా తమను తాము కాపాడుకోవడం తప్ప.. మరో మార్గం లేదని ప్రపంచం మొత్తం ఘోషిస్తోంది. ఒక్కరి తప్పు సమాజానికే పెనుముప్పుగా మారే పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
70 రోజుల్లో ప్రపంచం మొత్తం విస్తరణ..!
జనవరి మొదటి వారంలో చైనాలోని వుహాన్‌లో.. కరోనా వైరస్ ని కనిపెట్టారు. వైరస్ బయటపడి 70 రోజులు అటూ ఇటుగా మాత్రమే అయింది. ఇప్పుడా వైరస్ 190కిపైగా దేశాలను గడగడలాడిస్తోంది. ప్రపంచంలో ఉన్న ఆరు వందల కోట్ల మందిని ప్రాణభయంతో వణికిస్తోంది. మెట్టు మెట్టుగా పేర్చుకుంటూ పోతున్న దేశాల ఆర్థిక వ్యవస్థల్ని కుప్పకూల్చేస్తోంది. వైరస్ వ్యాప్తి అసాధారణంగా ఉంది. 70 రోజుల్లో ఒకటి దగ్గర్నుంచి ప్రారంభించి మూడున్నర లక్షల మందికి సోకడం మాత్రమే విశేషం కాదు.. అది దాదాపుగా ప్రపంచంలోని అన్ని దేశాలకూ వ్యాప్తి చెందడమే భయంకరం. ఎంత వేగంగా.., ఒక చోట నుంచి మరో చోటకు వ్యాప్తి చెందిందో.. దీన్ని బట్టే అర్థమైపోతుంది.
“వస్తూంటాయి.. పోతూంటాయి” అనుకునే మైండ్ సెట్ల వల్లే ఈ పరిస్థితి..!
కరోనా లాంటి వైరస్లు ప్రపంచం మీద దాడి చేయబోతున్నాయని.. చాలా హాలీవుడ్ సినిమాలొచ్చాయి. అయితే అవన్నీ బయోవార్ కేంద్రంగా సాగాయి. ప్రస్తుతం వైరస్ వ్యాప్తిలో బయోవార్ ఉందో లేదో కానీ.. ప్రపంచానికి పెను ప్రమాదంగా.. ఈ వైరస్ మారింది.. కరోనా వైరస్ గురించి లైట్ తీసుకుని .. అలాంటి వస్తూంటాయి.. పోతుంటాయి…. అదంతా నిరంతర ప్రక్రియ అనుకున్న దేశాలు.. తీవ్రంగా ఎఫెక్ట్ అవుతున్న విషయం మన కళ్ల ముందు ఉంది. ఇటలీ, ఇరాన్ లాంటి దేశాలు పిట్టల్లా రాలిపోతున్న తమ పౌరుల్ని చూసి.. గుండెలు బాదుకోవడం మినహా ఏమీ చేయలేకపోతున్నాయి. ఆర్థికంగా కుంగిపోతే.. ఏదో ఓ విధంగా బయటపడొచ్చు.. కానీ పోయే ప్రాణాలు మాత్రం తిరిగి రావు. ఈ దేశాల పరిస్థితి చూసి.. ఉలిక్కి పడిన ఇతర దేశాలు… ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఓ నెల, రెండు నెలలు దేశాన్ని షట్ డౌన్ చేస్తే.. అభివృద్ధి పరంగా.. ఆర్థిక పరంగా నష్టపోతామేమో కానీ… అలా చేయకుండా..కరోనాకు.. ఫ్రీ హ్యాండ్ ఇచ్చేస్తే.. స్మశానాలకు కూడా స్థలం దొరకని పరిస్థితి ఏర్పడుతుందని అంచనాకు వచ్చేశారు.
ప్రజల నిర్లక్ష్యం ఇలాగే ఉంటే వైరస్ జెండా పాతేస్తుంది..!
భారతదేశంలో జనవరి 30వ తేదీన తొలి సారి కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తిని కనిపెట్టారు. కరోనా ఇంత డెడ్లీ అనుకోలేదేమో కానీ.. నిర్లక్ష్యం చేశారు. ఫలితంగా… నెలన్నర రోజుల్లోనే… విశ్వరూపం ప్రదర్శించింది. లాక్డౌన్లు.. కర్ఫ్యూలు… తాత్కాలిక ఉపశమనాలే. వైరస్‌ను పూర్తిగా అంతం చేయాలంటే.. అంతకు మించి చేయాల్సి ఉంది. భారత్ ఈ విషయంలో చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. కారణం ఏదైా.. భారత్‌లో కరోనా ర్యాపిడ్‌గా విస్తరించడానికి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. దేన్నీ సీరియస్‌గా తీసుకోని జనం ఉన్నారు. పాలకులు కూడా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచంలో అత్యంత ఎక్కువ బాధిత దేశంగా భారత్ నిలబడే ప్రమాదం ఉందన్న అంచనాలు ఇప్పటికే వచ్చాయి. ఎంత వరకూ వ్యాప్తి చెందినా… అక్కడి వరకూ.. ఆపడానికే ప్రభుత్వాలు ఇప్పుడు.. శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నాయి. భాగస్వామ్యం అయి.. కరోనాకు దొరక్కుండా దాక్కోవడమే ప్రజల కర్తవ్యం.