టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్‌పై పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై.. కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చిన్న చిన్న కేసుల్లో పోలీసులు కస్టడీకి ఎందుకు కోరుతున్నారని ప్రశ్నించింది. పోలీసులు పెట్టిన కేసులకు.. జీవిత కాల శిక్ష పడే అవకాశం ఉందా అని ప్రశ్నించింది. అసలు అధికారిక సమాచారం ఏముందని… కస్టడీకి ఎందుకని.. కోర్టు ప్రశ్నించింది. తదుపరి విచారణపై స్టే విధిస్తూ… ఇరవై నాలుగో తేదీకి కేసును వాయిదా వేసింది. నకిలీ ఈమెయిల్ సృష్టించారని ఆరోపిస్తూ.. పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ కేసులో బెయిల్ వస్తుందని.. తెలిసిన వెంటనే… ఈ కేసులో అరెస్ట్ చేశారు. ఇందులోనూ… కస్టడీ కావాలని కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపైనే కోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అసలు.. ఇంత చిన్న చిన్న కేసుల్లో కస్టడీ కోరడమేమిటని కోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. పోలీసులకు ఇందులో ప్రత్యేకమైన ఇంటెన్షన్ ఉందని.. స్పష్టం చేసింది.
కోర్టు ఇలా వ్యాఖ్యానించడం ఇదే మొదటి సారి కాదు. గత వారం.. కూడా ఇదే తరహాలో పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. జీవితాంతం జైల్లో పెడతారా… అని ప్రశ్నించింది. ఓ మనిషిని ఇంతలా హింసించవచ్చా.. అని ఆశ్చర్యం కూడా వ్యక్తం చేసింది. అయితే పోలీసులు మాత్రం.. తమ తీరు మార్చుకోలేదు. కచ్చితంగా… జైల్లో ఉంచాలన్న లక్ష్యంతోనే… కేసు మీద కేసు బనాయిస్తూ పోతున్నారు. దానికి సాక్ష్యాలు ఉన్నాయా.. లేవా.. ప్రాథమిక విచారణ చేశారా.. లేదా అన్న విషయాలను పట్టించుకోవడం లేదు. దీంతో.. కోర్టులు కూడా ఉద్దేశపూర్వకంగా… రవిప్రకాష్ ను అరెస్ట్ చేసి జైల్లో ఉంచుతున్నారన్న అభిప్రాయానికి వస్తున్నాయి. అయితే.. పోలీసులు మాత్రం వెనక్కి తగ్గడం లేదు.
ప్రస్తుత స్పందన చూస్తే ఇరవై నాలుగో తేదీన కోర్టు కీలకమైన రూలింగ్ ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.