ఆంధ్రప్రదేశ్లో కరోనా పాజిటివ్ కేసులు రోజుకు కనీసం అరవై నమోదవుతున్నాయి. ఆపైన ఎనభై వరకూ.. లెక్కలు తేలుతున్నాయి. గత పది రోజులుగా ఇదే ట్రెండ్ కంటిన్యూ అవుతోంది. రోజుకు ఏడు వేల నుంచి పదివేల శాంపిళ్లను టెస్ట్ చేస్తున్నారు. పదివేల శాంపిళ్లు చేసినా.. అరవై దరి దాపుల్లోనే పాజిటివ్ కేసులు వస్తున్నాయి. అంత కంటే తక్కువ చేసినా.. అదే పరిస్థితి. మంగళవారం జరిపిన పరీక్షల్లో 60 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో.. మొత్తం ఏపీలో వీటి సంఖ్య 1777కి చేరింది. డిశ్చార్జ్ అయిన వారు.. మరణించిన వారు పోగా… యాక్టివ్ కేసుల సంఖ్య 1012గా ఉంది. నిన్న కొత్తగా నమోదైన కేసుల కన్నా డిశ్చార్జ్ అయిన వారే ఎక్కువగా ఉన్నారు.
తెలంగాణలో సింగిల్ డిజిట్లోనే.. పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. డిశ్చార్జ్ అవుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. దీంతో.. ఏపీతో పోలిస్తే.. అక్కడ యాక్టివ్ పాజిటివ్ కేసులు సగం మాత్రమే ఉన్నాయి. ఏపీ ఇరుగుపొరుగు రాష్ట్రాల్లో ఒక్క తమిళనాడులో మాత్రం.. కరోనా విజృంభిస్తోంది. మిగిలిన చోట్ల.. తగ్గు ముఖం పట్టింది. ఏపీలో మద్యం దుకాణాలు ప్రారంభించడంతో.. తొలి రెండు రోజులు ఎవరూ భౌతిక దూరం పాటించలేదు. పైగా.. అన్ని రకాల సడలింపులు ఇవ్వడంతో.. కరోనా వ్యాప్తి అధికమవుతుందన్న అభిప్రాయం ఏర్పడుతోంది.
అధికారులు మరింత పటిష్టమైన చర్యలు తీసుకోనున్నారు. వలస కూలీలలతో పాటు.. పెద్ద ఎత్తున ఇతర ప్రాంతాల నుంచి ఏపీ వాసులు తరలి వస్తున్నారు. ఈ కారణంగా ఏపీలో పాజిటివ్ కేసులు మరికొంత కాలం పెరుగుతూనే ఉంటాయని అంచనా వేస్తున్నారు. నిన్న ఇద్దరు కరోనా కారణంగా మరణించడంతో .. చనిపోయిన వారి సంఖ్య 36కి చేరింది. ఇది దక్షిణాది రాష్ట్రాల్లోనే ఎక్కువ.