తీసేసిన స్టీల్ ప్లాంట్ కార్మికుల్ని మళ్లీ తీసుకోవాలని షర్మిల విశాఖ వెళ్లి ధర్నా చేశారు. వారితో కలిసి రోడ్డుపై బైఠాయించారు. నలభై ఎనిమిది గంటల డెడ్ లైన్ పెట్టారు. ఈ లోగా తీసేసిన కార్మికులందర్నీ మళ్లీ తీసుకోకపోతే.. మళ్లీ వచ్చి ధర్నా చేస్తానని ప్రకటించారు. చంద్రబాబు ఈ విషయంలో వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. ఆమె అలా ధర్నా ముగిసిన కాసేపటికే కార్మికులందర్నీ మళ్లీ విధుల్లోకి తీసుకుంటూ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది.
విశాఖ స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికుల్ని తీసేయడం కొద్ది రోజులుగా వివాదాస్పదమవుతోంది. ఒకరు ఇద్దరు కాదు ఏకంగా నాలుగు వేల మంది కాంట్రాక్ట్ కార్మికుల్ని తీసేశారు. ముడి ఖనిజం లేదని ఉత్పత్తి పూర్తి స్థాయిలో జరగడం లేదన్న కారణంగా వీరికి పని ఉండటం లేదని తీసేశారు. కానీ ఇప్పుడు స్టీల్ ప్లాంట్ విషయంలో ఏం జరిగినా పెద్ద ఇష్యూ అవుతోంది. ఈ విషయం కాకుండా ఉంటుందా ?. అయితే ఈ అంశాన్ని షర్మిల మాత్రమే రాజకీయంగా ఉపయోగించుకోలగలిగారు.
వైసీపీ నేతలు ఎవరూ కాంట్రాక్ట్ కార్మికుల గురించి మాట్లాడలేదు. బొత్స సత్యనారాయణ ప్రెస్ మీట్ బెట్టి మొక్కుబడిగా ఓ డిమాండ్ చేశారు. టీడీపీ నేతలు.. స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఎక్కడికి పోవని భరోసా ఇస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో తొలగించిన కాంట్రాక్ట్ కార్మికులను యాదావిధిగా కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్న యాజమాన్యం వెంటనే ఉత్తర్వులు కూడా ఇచ్చింది. దీంతో సమస్యకు పరిష్కారం లభించినట్లయింది.