ఉక్కు ఉద్యమం.. ఏపీ రాజకీయాల్లోనే కాదు.. తెలంగాణ రాజకీయాల్లోనూ కలకలం రేపుతోంది. ఉక్కు ఉద్యమానికి మద్దతు పలికిన కేటీఆర్.. అవసరం అయితే.. విశాఖ వస్తానని ప్రకటించారు. ఈ విషయంపై ఏపీ రాజకీయ నేతలు పెద్దగా పట్టించుకోలేదు కానీ.. ఇతర తెలంగాణ పార్టీలు మాత్రం కేటీఆర్‌పై ఫైరయిపోతున్నాయి. ఈ అంశాన్ని బీజేపీ పూర్తిగా లైట్ తీసుకుంది. ప్రైవేటీకరణ ఆ పార్టీ విధానం కాబట్టి.. ఎవరు ఏం అన్నా స్పందించరు. కాంగ్రెస్ పార్టీ మాత్రం సీరియస్‌గా తీసుకుంది. సెటిలర్ల ఓట్ల కోసమే కొత్తగా కేటీఆర్ ప్రకటన చేశారనికాంగ్రెస్ పార్టీ నమ్ముతోంది.
విశాఖ ఉక్కు పోరాటానికి కేటీఆర్ మద్దతు వెనక దురుద్దేశం అందని కాంగ్రేస్ నేతలు కౌంటర్ అటాక్ మొదలు పెట్టారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సెటిలర్ల ఓట్ల కోసమే టీఆర్ఎస్ సరికొత్త ఎత్తుగడ వేసిందని కాంగ్రేస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. బీజేపీ పై గల్లీలో టీఆర్ఎస్ చేప్పే మాటలకు డిల్లీలో చేతలకు పొంతనలేదని మండిపడ్డారు. నిజాం షుగర్ పై మాట్లాడని టీఆర్ఎస్ నేతలు విశాఖ ఉక్కుమీద ఉద్యమం చేస్తామంటే సీమంధ్రులు నమ్మరని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రావణ్ ఎద్దేవ చేశారు. తెలంగాణలో ఇప్పుడు పొలిటికల్ గ్రౌండ్ లో చర్చంతా విశాఖ ఉక్కుపోరాటం మీదే జరుగుతోంది.
నిజానికి ఎన్నికలు వచ్చినప్పుడల్లా.. తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు ఆంధ్రా జపం చేస్తూంటారు. గతంలో అమరావతికి మద్దతుగా ప్రకటనలు చేశారు. ఇప్పుడు… స్టీల్ ప్లాంట్ సీజన్ నడుస్తోంది కాబట్టి.. స్టీల్ ప్లాంట్ మద్దతు ప్రకటించారన్న విశ్లేషణలు ఉన్నాయి. గతంలో ప్రత్యేకహోదా గురించి కూడా అంతే చెప్పారు. కానీ ఒక్క సారంటే ఒక్క సారి కూడా ఎన్నికలయిన తర్వాత ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలన్న డిమాండ్ టీఆర్ఎస్ ఎంపీలు ఎక్కడా వినిపించలేదు. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ మద్దతు కూడా అంతేనని.. రేపు బీజేపీతో సన్నిహిత సంబంధాల కోసం.. ఎన్నికలయ్యాక.. రైతు చట్టాలకు మద్దతు ప్రకటించినట్లుగానే.. స్టీల్ ప్లాంట్ అమ్మకానికి మద్దతు ప్రకటించినా ఆశ్చర్యం లేదన్న అభిప్రాయం తెలంగాణ విపక్షాలు వ్యక్తం చేస్తున్నాయి.