విశాఖ పట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులు సమ్మెకు వెళ్లాలని నిర్ణయించారు. ఈ మేరకు యాజమాన్యానికి నోటీసులు ఇచ్చారు. ఈ నెర ఇరవై ఐదు తరవాత ఎప్పుడైనా సమ్మెకు వెళ్తామని.. స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు నోటీసులో పేర్కొన్నాయి. నిబంధనల ప్రకారం.. నోటీసులు ఇచ్చిన పధ్నాలుగు రోజుల తర్వాత సమ్మె చేయాలి. పోస్కోతో స్టీల్ ప్లాంట్ చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేయడమే డిమాండ్‌గా నోటీసులో పేర్కొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ భూముల్లో.. గ్రీన్ ఫీల్డ్ ప్లాంట్ నిర్మాణానికి పోస్కోతో ఒప్పందం పూర్తయిందని… ఇటీవలే వెలుగులోకి వచ్చింది.
రాష్ట్ర ప్రభుత్వానికి మొత్తం తెలుసని కేంద్రం కూడా పార్లమెంట్ సాక్షిగా చెప్పింది. ఇంత కాలం.. ఏపీ సర్కార్ తమకేమీ తెలియదని బుకాయిస్తూ వచ్చినా… ఒప్పందం విషయం బయటపడటంతో కలకలం రేగుతోంది. ఈ ఒప్పందాన్ని రద్దు చేయాల్నన డిమాండ్‌తోనే.. కార్మిక సంఘాలు సమ్మెకు దిగుతున్నాయి. స్టీల్ ప్లాంట్ ఆందోళనలు రోజు రోజుకు ఉద్ధృతం అవుతున్నాయి. స్టీల్ ప్లాంట్ సీఎండీతో పాటు కొంత మంది ఉన్నతాధికారులు ఢిల్లీ వెళ్లిపోయారు. వారంతా ఒడిషాకు చెందినవారు. కొంత మంది డైరక్టర్లు స్టీల్ ప్లాంట్ వైపు రావడానికి భయపడుతున్నారు. ఇటీవల ఫైనాన్స్ డైరక్టర్‌ను ఆరు గంటల పాటు కార్మికులు నిర్బంధించారు. ఇప్పుడు కార్మికులు నేరుగా సమ్మె యోచన చేస్తూండటంతో స్టీల్ ప్లాంట్ కార్యకలాపాలు పూర్తి స్థాయిలో నిలిచిపోయే ప్రమాదం ఉంది.
ఏ ఒక్క కార్మిక సంఘం కూడా ప్రైవేటీకరణకు మద్దతు తెలిపే అవకాశం ఉండదు. ఈ కారణంగా స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి ఆగిపోనుంది. అదే జరిగితే ప్లాంట్ మరింత కష్టాల్లో పడుతుందని.. ప్రైవేటీకరణ చేయాలనుకుంటున్న కేంద్రానికి మరింత అవకాశం ఇచ్చినట్లవుతుందన్న అభిప్రాయం కూడా.. కొంత మందిలో ఉంది. అయితే.. సమ్మె నిర్ణయానికే కార్మిక సంఘాలు మొగ్గు చూపినట్లుగా తెలుస్తోంది.