ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ ఛీఫ్ గా స్టీఫెన్ రవీంద్ర వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. తెలంగాణ కేడర్ కు చెందిన ఈ అధికారిని ఏపీకి బదిలీ మీద తీసుకెళ్లాలనే ఆలోచనలో జగన్ ఉన్నట్టు సమాచారం. ఇదే అంశమై ఏపీకి కాబోయే సీఎం జగన్మోహన్ రెడ్డి… తెలంగాణ సీఎం కేసీఆర్ ను కోరినట్టుగా ప్రచారం జరుగుతోంది. రవీంద్రను ఐదేళ్లపాటు డెప్యుటేషన్ మీద ఆంధ్రాకి పంపించాలని తాజాగా కేసీఆర్ ను జగన్ కోరినట్టు వినిపిస్తోంది. మొన్ననే, సీఎం కేసీఆర్ ను జగన్ మర్యాదపూర్వకంగా కలిసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఈ ఇద్దరూ దాదాపు 15 నిమిషాలపాటు ఏకాంతంగా చర్చించుకున్నారు. ఈ సమయంలోనే రవీంద్రను ఏపీకి పంపించాలనే ప్రతిపాదనను కేసీఆర్ ముందు జగన్ ఉంచారట! అయితే, దీనికి సంబంధించిన ఆదేశాలు కేంద్రం నుంచి రావాల్సి ఉంటుంది. ఆ ప్రయత్నం కూడా వైకాపా నేతలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
కాబోయే ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి కలుసుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ప్రధానితో భేటీ అయినప్పుడే కొంతమంది ఉన్నతాధికారుల బదిలీలు, మార్పుల గురించి జగన్ మాట్లాడినట్టు వైకాపా వర్గాలు అంటున్నాయి. జగన్ తో పాటు వైకాపా ఎంపీలు కూడా ఢిల్లీకి వెళ్లినవారిలో ఉన్నారు. స్టీఫెన్ రవీంద్ర డెప్యుటేషన్ విషయమై హోంశాఖకు చెందిన కొంతమంది ఉన్నతాధికారులతో వైకాపా ఎంపీలు మాట్లాడినట్టుగా తెలుస్తోంది. ఈ సందర్భంగా వారికి సానుకూల సంకేతాలే అందాయట! రవీంద్ర విషయమై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు విడివిడిగా ప్రతిపాదనలు పంపిస్తే తప్పకుండా సానుకూలంగా స్వీకరిస్తామని హోం శాఖకు చెందిన అధికారులు వైకాపా ఎంపీలతో చెప్పినట్టుగా సమాచారం.
ఇంతకీ… స్టీఫెన్ రవీంద్రని పట్టుబట్టి మరీ ఏపీ ఇంటెలిజెన్స్ కి ఎందుకు తీసుకొస్తున్నారనేదే చర్చ! ఈయన వైయస్ కుటుంబంతో సన్నిహితంగా ఉంటారని అంటారు. అంతేకాదు, ఆ మధ్య తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయమైన డాటా చోరీ కేసును పరిష్కరించే బృందం రవీంద్ర నేతృత్వంలోనే పనిచేసింది. ఏపీ మాజీ సీఎం చంద్రబాబుకు వ్యతిరేకంగా ఆ కేసులో కొన్ని ఆధారాలు దొరకాయంటూ అప్పట్లో గుసగుసలు చాలా వినిపించాయి. ఆయన్నే ఇప్పుడు ఇంటిజెన్స్ ఛీఫ్ గా తేవాలనుకునే ప్రతిపాదన కొంత ఆసక్తికరంగా మారింది. పైగా, దీనికి తెలంగాణ సీఎం కేసీఆర్ మద్దతు కూడా లభిస్తున్నట్టుగా కథనాలొస్తున్నాయి.